రుణమాఫీ ఓ‘బూటకం’..! | TDP govt cheating farm loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ఓ‘బూటకం’..!

May 13 2015 1:21 AM | Updated on Jun 4 2019 5:04 PM

రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు దగ్గరపడడంతో రైతులు రుణమాఫీ సెల్‌కు బారులు తీరారు.

విజయనగరంవ్యవసాయం:  రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు  దగ్గరపడడంతో రైతులు రుణమాఫీ సెల్‌కు బారులు తీరారు.  ఉదయం 8 గంటల నుంచే రైతులు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌లో ఉన్న రుణమాఫీ సెల్‌కు చేరుకున్నారు. వేలాదిగా రైతులు కలెక్టరేట్‌కు రావడంతో   వ్యవసాయశాఖ అధికారులు 11 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలో  మహిళారైతులు కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు కానీ రైతుల దాహార్తిని తీర్చడానికి కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు.
 
 దీంతో కలెక్టరేట్  ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద రైతులు ఎండలో అవస్థలు పడ్డారు. మండు టెండు లోనే గంటల తరబడి  నిరీక్షించారు. కొంతమంది రైతులు ఎండనుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీమ్‌లు కొనుగోలు చేశారు. రుణమాఫీ సెల్‌కు వేలాదిగా రైతులు రావడంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం  ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 3622 మంది రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఒక్క రోజు మాత్రం 1883 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం 2వేల మంది వరకు  రైతులు వచ్చారు.
 
 నాపేరు మత్చ కచ్చం నాయుడు:
 మాది నెల్లిమర్ల మండలం జోగిరాజుపేట గ్రామం. నేను సతివాడ పీఏసీఎస్‌లో 2013లో రూ. 17 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం ప్రకటించిన మొదటి, రెండు విడతల్లో రుణ మాఫీ కాలేదు. రెండు సార్లు దరఖాస్తు చేశాను.  ముఖ్యమంత్రి చంద్రబాబు మాఫీ చేస్తారన్న నమ్మకం లేదు. ఆయన మాటలు  నమ్మడానికి వీల్లేదు.
 
 నాపేరు ఎం.ప్రకాశ్: మాది నెల్లిమర్ల మండలం మధుపాడ గ్రామం. నేను 2013లో సతివాడ పీఏసీఎస్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాను. మొదటి, రెండు విడతల్లో నాకు మాఫీ కాలేదు. ఇప్పటికి మూడుసార్లు  అధికారులకు  దరఖాస్తు చేసాను.  ఇప్పుడు మళ్లీ చేయమంటున్నారు.   అధికారుల చుట్టూ తిరగలేకున్నాం.  మాఫీ చేస్తారని నేను అనుకోవడం లేదు.  చంద్రబాబు పై నాకు నమ్మకం లేదు. ఇది ఈఇద్దరి రైతులమాటే కాదు. జిల్లాలో ఉన్న వేలాదిమంది రైతులు చెబుతున్న మాట.  
 
 అధికారంలోకి రాగానే రైతులందరి రుణాలను మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన  తర్వాత మాట మార్చడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రుణమాఫీ చేయడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, విస్తీర్ణం సరిపడా లేదు తదితర కుంటి సాకులు చెప్పి రైతులకు రుణమాఫీ చేయడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు మాఫీపైనే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ సర్కార్ పుణ్యాన రైతుల ఆశలు అడుగంటుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement