ఏడాదిగా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చటమే ధ్యేయంగా పనిచేస్తోందని
విజయనగరం మున్సిపాలిటీ: ఏడాదిగా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చటమే ధ్యేయంగా పనిచేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపుతున్నందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. తన కోసం ఎదురుచూస్తున్న కుమార్తెను పోలీసులు చిన్నబుచ్చుతూ బయటికి పంపించటంపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారన్నారు.
అభివృద్ధి, పెట్టుబడుల పేరిట ప్రతిసారి సింగపూర్, జపాన్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.5వేల 500 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ చెప్పుకొంటున్న టీడీపీ ప్రభుత్వం బాధ్యలపై చర్యకు ఎందుకు తాత్సారం చేస్తోందన్నారు. నీరు చెట్టు కార్యక్రమంతో సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన అయిదు హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.