రేషన్‌ డీలర్లకూ.. కుచ్చుటోపీ

TDP Government Not Supported To Ration Dealers - Sakshi

రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. నిరంతరం సేవలందిస్తోన్న రేషన్‌ డీలర్లను ఆదుకుంటామని ఇప్పటి వరకూ 5 జీవోలు జారీ చేసింది. అయితే ఇందులో కేవలం ఒక్క జీఓను మాత్రమే అమలు చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా డీలర్లు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు 16న వాటిలో ఐదు డిమాండ్లను సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆమోదించి, ఆందోళనలు, నిరసనలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో డీలర్లు ఆందోళనల్ని విరమించారు. అయితే ఆమోదించిన డిమాండ్ల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని డీలర్లు మండిపడుతున్నారు.

డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు డీలర్ల అసోసియేషన్లు ఒకే వేదికపైకి వచ్చి జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడ్డాయి. ఆయా సమస్యల్ని పరిష్కరించేందుకు జీఓను జారీ చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కేశారని వాపోతున్నారు. ఐదు హామీలకూ ఐదు జీఓలు జారీ చేయాల్సి ఉండగా ఒక్క జీఓను మాత్రమే ప్రభుత్వం జారీ చేసింది. రేషన్‌ షాపుల ద్వారా విక్రయించే బియ్యానికి క్వింటాలుకు రూ.100 కమీషన్‌ చెల్లించే విధంగా జారీ చేసిన జీఓ ఎట్టకేలకు అమలు జరిపినప్పటికీ మిగిలిన నాలుగు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. రాష్ట్రంలో 28,935 మంది డీలర్లున్నారు. సుమారు 1.16 లక్షల కుటుంబాల వారు రేషన్‌ షాపులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కనీస వేతనాలు కూడా దక్కని విధంగా రేషన్‌ షాపులలో పనిచేస్తున్న డీలర్లకు వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాయకీయ రొచ్చులోకి డీలర్లు
ప్రజా పంపిణీలో విశిష్ట సేవలందించే డీలర్లను రాజకీయ రొచ్చులోకి ఆపద్ధర్మ టీడీపీ ప్రభుత్వం లాగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో డీలర్లు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని చట్టం ఉన్నప్పటికీ డీలర్ల సంఘ రాష్ట్ర నాయకుల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు కేటాయిస్తామని రాష్ట్ర సంఘ నాయకుడికి ఎర వేయడంతో అతను తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రస్థాయి డీలర్ల సంఘాలు నాలుగు ఉండగా వీటిలో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడుగా కొనసాగుతున్న లీలా మాధవరావు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీలర్ల అవగాహన సదస్సులు నిర్వహించిన ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలనే సందేశాల్ని ఇవ్వడంపై çపలువురు డీలర్లు తీవ్రంగా మథనపడుతున్నారు. 

సదస్సుకు ‘పశ్చిమ’ వ్యతిరేకం
రాష్ట్రస్థాయిలో డీలర్ల సంఘ అధ్యక్షుడు మాధవరావు నిర్వహిస్తున్న సదస్సులకు జిల్లా డీలర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిసింది. ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్ల వచ్చే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, తదనంతరం ఏఏ ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందోనని జిల్లా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లను ఒక పార్టీకి తాకట్టు పెట్టడం దారుణమని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఐదు డిమాండ్లు 
ఆమోదించిన ఐదు డిమాండ్లు ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని డీలర్లు పేర్కొంటున్నారు. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినా వాటిని అమలు చేయడంలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  • క్వింటా బియ్యానికి కమీషన్‌ రూ.70 నుంచి 100కు పెంచాలి. 
  • సరుకుల దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలి. 
  • డీలర్లకు ఆరేళ్లుగా రావలసిన బకాయిలు రూ.100 కోట్లను వెంటనే చెల్లించాలి. 
  • డీలర్‌ చనిపోతే మట్టి ఖర్చులకు గాను రూ.20 వేలు చెల్లించాలి. 
  • డీలర్లకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి. 

ఆదేశాలిచ్చాం
రేషన్‌ డీలర్లు రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఓటు ప్రభావిత కార్యక్రమాల్లోనూ, పార్టీల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశాం. సభలు, సమావేశాలు డీలర్లు నిర్వహిస్తే కోడ్‌ ఉల్లంఘన అవుతుంది. కోడ్‌ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు.
–జి.మోహనబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top