రుణమాఫీ ఒట్టిమాటే..

TDP Government Not Implemented Rythu Runa Mafi - Sakshi

రుణ ఉపశమన అర్హత పత్రాలకే పరిమితం

అన్నదాతలను మభ్యపెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం

చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

‘అన్నదాతలను ఆదుకుంటా. రుణమాఫీ చేస్తా.’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో కొండంత రాగం తీసి గద్దెనెక్కాక వేలాది మందికి గోరంత సాయం కూడా చేయలేదు. రుణమాఫీ హామీ ఒట్టిమాటే అని తేలిపోయింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని రైతులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

సాక్షి, దొరవారిసత్రం (నెల్లూరు): ఉమ్మడి రాష్ట్రంలో ఏకాలంలో రైతు రుణమాఫీ చేసి అన్నదాతలను ఆదుకున్న ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. ఆయన మరణానంతరం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి వారిని నట్టేట ముంచారు. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రుణ ఉపశమన అర్హత పత్రాలు పొందిన రైతులకు కూడా ఇంకా బ్యాంకుల్లో మాఫీ నగదు పూర్తిస్థాయిలో జమ కాలేదు. అన్నదాతలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం మాది రైతు ప్రభుత్వం అంటూ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.

ఇదీ పరిస్థితి
సూళ్లూరుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని దొరవారిసత్రం, తడ, సూళ్లూరుపేట మండలాల్లో ఇప్పటివరకు మూడు విడతల్లో 38,198 (కుటుంబాలు 4,270) మంది రైతులకు, నాయుడుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో పెళ్లకూరు, ఓజిలి, నాయుడుపేట మండలాల్లో మూడు విడతల్లో 51,702 (కుటుంబాలు 4,500 పైబడి) మందికి మాఫీ జరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా తొలి, మలి విడతల్లో ఎంతోమంది రైతుల అకౌంట్లలో నగదు జమ కాలేదు. కొందరికి మాత్రమే కొంత మొత్తంలో నగదు జమచేసి మిగిలిన వారి గురించి పట్టించుకోలేదు. దీంతో వారు నేటికీ బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారులు కూడా వారికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. బ్యాంక్‌ అధికారులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారని రుణ ఉపశమన పత్రాలు పొందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాఫీ చేయకుండానే ఐదు సంవత్సరాలు మాటలతో మాయ చేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద..
తెలుగుదేశం పార్టీ హయాంలో మోసపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో వరాలు ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 రెండో ఏడాది నుంచి నాలుగేళ్లపాటు ఇస్తామని చెప్పారు. 
బీమా ప్రీమియం మొత్తం చెల్లింపు.
వడ్డీలేని పంట రుణాలివ్వడం.
ఉచితంగా బోర్లు వేయించడం.
వ్యవసాయానికి పగటిపూటే ఉచితంగా 9 గంటల కరెంట్‌ ఇవ్వడం. 
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు.


ఈయన పేరు కర్లపూడి చంద్రయ్య. దొరవారిసత్రం మండలంలోని మైలాంగం ఎస్సీ కాలనీ వాసి. ఇతనికి నేలపట్టు రెవెన్యూ గ్రూపు పరిధిలో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బ్యాంకులో రూ.20 వేల వరకు పంటపై రుణం తీసుకున్నాడు. రుణం మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. అయితే అనేకమంది అధికారుల చుట్టూ తిరిగినా రుణ మాఫీ కాలేదు. ఏమి చేయాలో తెలియడంలేదని చంద్రయ్య వాపోతున్నాడు.


ఈయన పేరు నాయుడు దయాకర్‌రెడ్డి. దొరవారిసత్రం మండలంలోని తుంగమడుగు గ్రామ వాసి. ఇతనికి వెదురుపట్టు రెవెన్యూ పరిధిలోని 2–11, 5–4, 5–5 సర్వే నంబర్లలో నాలుగెకరాల సాగు భూమి ఉంది. రుణమాఫీకి అర్హుడు. కానీ ఒక్క రూపాయి కూడా వర్తించలేదు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగాడు. నెల్లూరులో ఏర్పాటుచేసిన రైతు సాధికార సంస్థ వద్దకు అనేకసార్లు వెళ్లి వినతిపత్రాలు అందజేశాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top