హారతి కర్పూరంలా కరిగిపోయిన మఠం ఆస్తులు | TDP Followers And Leaders Occupied Tirupati Mattam Donars Lands And Properties | Sakshi
Sakshi News home page

హథీ రాంజీ మఠం భూములు మాయం

Jan 30 2020 11:14 AM | Updated on Jan 30 2020 1:44 PM

TDP Followers And Leaders Occupied Tirupati Mattam Donars Lands And Properties - Sakshi

అర్జున్‌దాస్‌ మహంతు గదికి తాళం వేసిన అధికారులు

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వసతి సౌకర్యాల కోసం దాతలిచ్చిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కోట్ల రూపాయల విలువైన భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. భూములను కాపాడాల్సిన హథీరాంజీ మఠం నిర్వాహకులు కొందరు డబ్బులకు ఆశపడి ఒకే సర్వే నంబర్‌లోనే భూములను పలువురికి విక్రయించడం ప్రారంభించారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరం వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలో తిరుపతి హథీరాంజీ మఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠం కస్టోడియన్‌ అర్జున్‌దాస్‌ మహంతుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓకు మఠం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సాక్షి, తిరుపతి : హథీరాంజీ బాబా రాజస్థాన్‌ ప్రాంత వాసి. రెండు శతాబ్దాల క్రితం తిరుమల వచ్చిన ఆయన వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడయ్యాడు. 18వ శతాబ్దం నుంచి తిరుమలలోనే ఉంటూ శ్రీవారి సేవలో తరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు కాకముందు హథీరాంజీ మఠం ద్వారానే స్వామివారికి కైంకర్యాలు జరిగేవి. అందుకే ఆ సమయంలో శ్రీవారి భక్తులందరూ బహుమతులు, కానుకలు, దాన ధర్మాలన్నీ హథీరాంజీ మఠానికే ఇచ్చేవారు. మఠం పేరున ఇచ్చిన భూములను అప్పట్లో రైతులకు కౌలుకు ఇచ్చేవారు. కౌలు ద్వారా వచ్చే ఆదాయంతో మఠం నిర్వాహకులు మరికొన్ని ఎకరాలను కొనుగోలు చేశారు. అలా వచ్చిన మొత్తం భూములు 2,058 ఎకరాలు ఉన్నాయి. హథీరాంజీ మఠానికి తిరుపతితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో వేల కోట్ల రుపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. 

హారతి కర్పూరంలో కరిగిపోయిన ఆస్తులు 
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నాయకులు అధికార, ధన బలాన్ని వినియోగించుకుని మఠం భూముల్లో రాత్రికి రాత్రే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. కొద్ది రోజుల తర్వాత పక్కా భవనాలు నిర్మించుకున్నారు. మఠం భూముల ఆక్రమణపై శ్రీవారి భక్తులు అనేక మంది ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి మఠం భూములు కాపాడమని వేడుకుంటూనే ఉన్నారు. అక్రమార్కుల జాబితాలో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక చోటామోటా నాయకులు ముందు వరుసలో ఉన్నారు. హథీరాంజీ మఠానికి భక్తులు అప్పగించిన భూములు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయనే విషయం బయటకు పొక్కకుండా మఠం నిర్వాహకులు కొందరు తొక్కిపెడుతున్నారు. ఆక్రమణకు గురైన భూములన్నీ గతంలో బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చిన భూములే కావటం గమనార్హం. లీజుకు తీసుకున్న వారు కొందరు ఇతరులకు విక్రయిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం లీజుదారులు అమ్మడానికి వీల్లేదు. వాటిని కొనుగోలు చేసినా చెల్లదు. అందుకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. 

మహంతి సస్పెన్షన్‌కు కారణమైన భూములివే.. 
హథీరాంజీ మఠం నిర్వాహకులు అర్జున్‌దాస్‌ మహంతి సస్పెన్షన్‌కు తిరుపతి రూరల్‌ మండల పరిధిలో ఉన్న భూ వివాదాలే కారణంగా తెలుస్తోంది. మఠానికి చెందిన ఆస్తులను ఎవరైనా లీజుకు ఇవ్వాలంటే తప్పనిసరిగా దేవదాయ ధర్మాదాయ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండోమెంట్‌ శాఖ ఉద్యోగి సమక్షంలోనే వేలం పాటలు నిర్వహించాలి. ఆ తర్వాత ఆ శాఖ కమిషనర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టుగా మఠం ఆస్తులను లీజుకు ఇచ్చే అధికారం అర్జున్‌ దాస్‌ మహంతికి లేదు. కాని ఎక్కడా ఆ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలున్నాయి. అవిలాల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 13, 15, 17, 17/2, 3, 5లో 175 ఎకరాలకుపైగా విలువైన భూమి ఉంది. ఈ భూమి తమదేనంటూ కొచ్చి కృష్ణారావు, కొచ్చి మనోరమ, కలిమిలి సుబ్రమణ్యం, కలిమిలి చెంగల్రాయులు, వెంకటయ్య, బుగ్గమఠం, హథీరాంజీ మఠం నిర్వాహకులు తమదంటే తమదేనని చెప్పుకుంటున్నారు.

అయితే ఇందులో రూ.కోట్ల విలువైన భూమిని మాజీ మంత్రి, మాజీ ఎంపీ అనుచరులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క టీడీపీ నేతలు డూప్లికేట్‌ పత్రాలు సృష్టించి, విచ్చలవిడిగా ఆక్రమించుకుంటూ రాత్రికిరాత్రే తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్నారు. అదేవిధంగా తిరుపతి నడిబొడ్డులోని రైతుబజారు వెనుక వైపు ఎకరం మఠం భూమి, ఎయిర్‌బైపాస్‌ రహదారిపై ఉన్న 9 ఎకరాల మఠం భూమిని చంద్రబాబు అత్యంత సన్నిహితుడు ఆక్రమించి ఏకంగా అతిపెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. ఇటీవల తిరుపతిలో అత్యంత విలువ చేసే 53 ఎకరాల మఠం భూమిని ధారాదత్తం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటి వెనుక మఠం నిర్వాహకుల పాత్ర ఉందనే అనుమానాలున్నాయి. హథీరాంజీ మఠానికి సంబంధించిన 459.42 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా వి క్రయించినట్లు అర్జున్‌దాస్‌ మహంతిపై ప్రధాన ఆరోపణ ఉంది. 

అర్జున్‌ దాస్‌ నేపథ్యం 
అర్జున్‌ దాసు మహంతి మంగళవారం వరకు మఠం నిర్వాహకుడిగా పనిచేశారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్‌ అయిన మిశ్రా అర్జున్‌ దాస్‌ మహంతికి బంధువు. కర్ణాటక ప్రభుత్వం నుంచి పింఛన్‌ తీసుకొంటున్న మఠం పరిపాలనాధికారి మిశ్ర ఇక్కడ కూడా జీతం తీసుకొంటుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి పింఛన్‌ తీసుకుంటూ మరో సంస్థ నుంచి జీతం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంతేగాకుండా ఇటీవల తిరుపతి కేంద్రంగా హథీరాంజీ సంస్కృతి పరిరక్షణ సంస్థాన్‌ పేరిటి రెండు ట్రస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీటికి మిశ్రానే నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. హథీరాంజీ మఠానికి దాతలు ఇస్తున్న నిధులను ఈ ట్రస్టులకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.  

అర్జున్‌దాస్‌ మహంతు గదికి తాళం 
తిరుమల: తిరుమల హథీరాంజీ మఠంలోని అర్జున్‌దాస్‌ మొహంతు గదికి దేవాదాయ శాఖ అధికారు లు తాళం వేశారు. బుధవా రం సాయంత్రం తిరుమలకు చేరుకున్న హథీరాంజీ మఠం ఇన్‌చార్జి, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి మఠాన్ని పరిశీలించారు. తిరుమలలో మఠానికి సంబంధించిన ఆస్తులు, ఇతర రికార్డులను పరిశీలించామని, అర్జున్‌దాస్‌ మహంతు అందుబాటులో లేకపోవడంతో గదికి తాళం వేశామని తెలిపారు. ఆయన రాగానే రికార్డులను పరిశీలిస్తామని చెప్పారు. మహంతుపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి, నిజ నిర్ధారణ చేస్తామని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement