పరీక్షలెలా నిర్వహించాలి? | Sakshi
Sakshi News home page

పరీక్షలెలా నిర్వహించాలి?

Published Wed, Oct 10 2018 3:06 PM

TDP Delayed Government School Exams Funds - Sakshi

కర్నూలు సిటీ: పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు మంజూరు చేయడం లేదు.  నిధులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు  పలుమార్లు లేఖలు రాసినా, వీడియో కాన్ఫరెన్స్‌లలో అడిగినా  స్పందన కరువైంది.  విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు  పరీక్షల నిర్వహణకు ఏ మాత్రం సరిపోకపోవడంతో పరీక్షలు ఎలా నిర్వహించాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

రెండేళ్లుగా బిల్లులు పెండిగ్‌..
జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలలు 4339 ఉన్నాయి. వీటిలో మొత్తం 6.65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 1నుంచి 5వ తరగతుల వరకు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఏడాదిలో మూడు ఫార్మాటివ్‌ పరీక్షలు  జరుగుతాయి. 6 నుంచి 10వ తరగతుల వరకు డీసీఈబీ (డిస్ట్రిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) ద్వారా సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏల నుంచి ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు మంజూరయ్యవి. అయితే 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల నుంచి నిధుల మంజూరు చేయకపోవడంతో  రెండేళ్లుగా  డీసీఈబీ ప్రశ్నపత్రాల ముద్రణకు బిల్లులు చెల్లించలేదు. సుమారుగా  రూ.కోటికిపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఈ ఏడాది సమ్మెటివ్‌ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రశ్నపత్రాలతో పాటు సమాధాన పత్రాలు కూడా ప్రభుత్వమే చెల్లించాలని విద్యావేత్తలు కూడా ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనర్హం.

విద్యార్థుల ఫీజుతోనే పరీక్షల నిర్వహణ  
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు పరీక్షలకు సర్వశిక్ష అభియాన్, 9,10 తరగతులకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ నుంచి నిధులు కేటాయించే వారు. అయితే 2016–17, 2017–18 విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల ముద్రణకు  నిధులు ఇవ్వడం లేదు. విద్యాహక్కు  చట్టం ప్రకారం 1–8 తరగతులకు విద్యార్థుల నుంచి పరీక్షల పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. కేవలం 9,10 తరగతులకు చెందిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నుంచి ఎస్‌సీఈఆర్‌టీ నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అలాగే ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థుల నుంచి నిర్ణయించిన మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేసి, జిల్లా సాధారణ పరీక్షల విభాగానికి అందజేయాలి.
  పాఠశాలల్లో 6నుంచి 8 తరగతులకు వరకు రూ.80, 9,10 తరగతులకు రూ.110 వసూలు చేస్తారు. ఇలా వచ్చిన ఫీజులతోనే సమ్మెటివ్‌ పరీక్షలకు అవసరమైన ప్రశ్నపత్రాల ముద్రణకు బిల్లు చెల్లిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు విద్యార్థులు, ప్రైవేటు సూళ్ల విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూల చేసిన నిధులు పరీక్షల నిర్వహణకు ఏమాత్రం సరిపోవడంలేదని, దీంతో బిల్లులు ఎలా చెల్లించాలో అర్థంకాక అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరాం
పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల ప్రశ్నపత్రాల ముద్రణకు అవసరమైన బిల్లులు రూ.కోటి వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులు చెల్లించాలని నెలన్నర క్రితం ఉన్నతాధికారులతో జరిగిన మీటింగ్‌లో కూడా ప్రస్థావించాం. చెల్లిస్తామని చెప్పలేదు కానీ ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీనే అందజేస్తుందని చెప్పారు. సెలవుల తరువాత నిర్వహించే సమ్మెటివ్‌ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9,10 తరగతుల విద్యార్థుల నుంచి రూ.40, ప్రైవేటు స్కూళ్లకు చెందిన 6,7,8 తరగతుల విద్యార్థుల నుంచి రూ.80, 9,10 తరగతి విద్యార్థుల నుంచి రూ.110 వసూలు చేశాం. ప్రస్తుతానికి ఈ నిధులతోనే పరీక్షలు నిర్వహించేందుకు చర్యలుతీసుకుంటున్నాం.               – నాగరాజు, డీసీఈబీ సెక్రటరీ

Advertisement

తప్పక చదవండి

Advertisement