పారిశుద్ధ్య కార్మికులపై దుర్భాషలు

TDP Counselor Abuses Sanitary Workers - Sakshi

సాక్షి,మంగళగిరిటౌన్‌: రాష్ట్రంలో టీడీపీ అధికారం పోయినా.. స్థానికంగా మాకేంటంటూ రెచ్చిపోతున్నారు టీడీపీ షాడో కౌన్సిలర్లు. మా తీరు ఇంతే అంటూ పదే పదే పారిశుద్ధ్య కార్మికులపై దుర్భాషలాడుతూ, దాడులకు దిగుతున్నాడు పట్టణానికి చెందిన ఓ టీడీపీ కౌన్సిలర్‌ భర్త. మంగళగిరి పట్టణ పరిధిలోని పాత మంగళగిరి కల్యాణ మండపం వద్ద శనివారం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై టీడీపీ కౌన్సిలర్‌ భర్త దుర్భాషలాడిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రోజువారీ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా శనివారం ఉదయం పాత మంగళగిరి వైపు పారిశుద్ధ్య పనులు చేస్తున్న నాగమణి అనే పారిశుద్ధ్య కార్మికురాలిపై ఏం పని చేస్తున్నావ్‌? అంటూ మహిళలు పైకి చెప్పుకోలేని విధంగా బూతులతో దుర్భాషలాడి నానా తిట్లూ తిట్టాడు. ఇంతలో ట్రాక్టర్‌పై డ్రైవర్‌ జలసూత్రం స్వామి, వర్కర్లు శ్రీను, కల్వపల్లి పెద్దవీరయ్య, మురళి, నరేష్, సుధాకర్‌ వెళ్లి ఏమైందంటూ అడగ్గా, వారిని సైతం నానా బూతులు తిడుతూ మేం డబ్బులిస్తే బతుకుతున్నారు.. చెప్పిన పని చేయడం తెలియదా అంటూ ఇష్టానుసారం బూతులు తిట్టాడు ఆ షాడో కౌన్సిలర్‌.

ఈ క్రమంలో సూపర్‌వైజర్‌ మహేష్‌కు పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి వచ్చిన మహేష్, కౌన్సిలర్‌ భర్త అయిన మునగాల సత్యనారాయణను ఏం జరిగిందని అడిగేలోగానే మహేష్‌ను కూడా బూతులతో దుర్భాషలాడాడు. ఇంతలో మునగాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు కర్రలతో కొట్టడానికి వచ్చారని, ఇటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అనేకసార్లు పారిశుద్ధ్య కార్మికులపై దుర్భాషలాడిన సంఘటనలు కోకొల్లలు. ఆడ, మగ తేడా లేకుండా నోటికొచ్చినట్లు ఎలాపడితే అలా మాట్లాడతాడని మహిళా పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు.  
కార్మిక సంఘ నేతలతో రాజీకి యత్నం
ఇదిలా ఉండగా ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేయగా, టీడీపీ కౌన్సిలర్‌ భర్త అయిన మునగాల సత్యనారాయణ మరికొంతమంది టీడీపీ కౌన్సిలర్లతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి రాజీ చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. ఇందులో భాగంగా కార్మిక సంఘ నేతలతో కేసు వెనక్కు తీసుకోమని, ఇందులో తన తప్పేమీ లేదంటూ బతిమాలాడాడు. అయితే కార్మిక సంఘ నేతలు, కార్మికులు మాత్రం ఇటువంటి ఘటనలు గతంలో కూడా చాలాసార్లు జరిగాయని, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. మంగళగిరి పట్టణ ఎస్సై నారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top