సీమాంధ్ర ప్రాంతంలోని సమైక్య ఉద్యమాన్ని చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏనాడు చెప్పలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆదివారం గుంటూరులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టమని, సమైక్యంగా ఉంచాలని ఆయన గతంలో కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై గతంలో కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్కే దిక్కులేదు, ఇక ఆంటోని కమిటీ ఏం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.