
విశ్లేషణ
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై ఎన్నో ఏళ్లుగా పట్టిన మంకుపట్టు సడలించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కల్పించేందుకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కొన్ని మార్పులు తేవడానికి సమాయత్తం అయింది. ప్రస్తుతం 12% శ్లాబులో ఉన్న నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలఖరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్థం అవుతున్నది. వస్తువుల ధరలు తగ్గితే విక్రయాలు పెరగడం వల్ల ఉత్పత్తి రంగం కళకళలాడే అవ కాశం ఉంది. గత కొన్నేళ్లుగా జీఎస్టీకి సంబంధించి ఎవరేమి మాట్లా డినా సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశంలో వినిమయ సంస్కృతిని మరింత పెంచడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతున్నారు. పరో క్షంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.
సరళతరం కాకపోగా చిక్కులు
8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ టాక్స్)గా చెప్పబడిన ‘జీఎస్‌టీ’ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెట్టింది. నిజానికి, గత 8 ఏళ్లుగా జీఎస్టీపై జరిగినంత చర్చ, వాదోపవాదాలు మరే అంశం మీదా జరగలేదు.
జీఎస్టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. అయితే, జీఎస్టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయనీ, ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందనీ చెప్పడం అర్ధ సత్యమే. జీఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలు వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు.
పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. ముఖ్యంగా, రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడాన్ని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 55 సమావేశాలు జరిపినప్పటికీ జీఎస్టీ మండలి భేటీలలో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.
జీఎస్టీ చిక్కుళ్లలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1,400కు పైబడిన వస్తువులు, 500 రకాల సేవలను ఈ నాలుగు శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారు గానీ అందులో హేతుబద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు.
ఉదాహరణకు జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18% జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహచర మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది.
సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ఇంత మొత్తం జీఎస్టీ వేయడం వల్ల... వారు జీవిత, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై 5% జీఎస్టీ విధించినా కొంతవరకు అర్థం ఉందిగానీ... ఏకంగా 18% పన్ను వేయడం అన్యాయమని పాలసీదారుల అసోసియేషన్ సైతం కేంద్రానికి విన్న వించినప్పటికీ సానుకూల స్పందన రావడం లేదు.
నిత్యావసరాలపై ఇంతా?
ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపు దారులకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వివాదాలు తలెత్తి చివ రకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహ కారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు కేంద్రం ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. దీన్ని ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను పెడచెవిన పెట్టింది.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపై, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపై 5% జీఎస్టీ మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా వ్యవహరించారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తులపై, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలపై 18% జీఎస్టీ విధించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. నిత్యావసర వస్తువులను మినహాయించి విలాస వస్తువుల పైననే పన్ను వేస్తామని చెప్పిన దానికీ, ఆచరణలో చేస్తున్న దానికీ పొంతన ఉండటం లేదు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలపై 35 శాతం జీఎస్టీ విధించాలంటూ జీఎస్టీ రేట్ల హేతు బద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం జీఎస్టీ మండలికి ఓ నివేదిక అందించింది. పన్నులు పెంచితే ఆరోగ్య హానికర ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలు మానేస్తారా అన్నది చర్చనీయాంశం. అదే నిజ మైతే మద్యం మీద కూడా అధికంగా పన్నులు వేయాల్సి ఉంటుంది.
ఎంఎస్‌ఎంఇలకు శరాఘాతం
జీఎస్టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న వాటిల్లో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీ రంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్‌ఎంఇ రంగం జీఎస్టీ కారణంగా కుదేలయిందన్నది చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలావరకు మూతబడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలకు తీరని నష్టం కలిగింది. వాటి సప్లయ్ చెయిన్ తెగిపోయిందని ఆ రంగంపై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు.
ఒకవైపు వస్తుసేవలను అంతిమంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ, మరోవైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్క రించుకోవడానికి జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవకాశం జీఎస్టీ వచ్చాక తగ్గిపోయింది.
జీఎస్టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసిపోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుకతోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్టీని కొందరు అభివర్ణించారు. మరికొందరు జీఎస్టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. వీటి మాటెలా ఉన్నా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతున్నదా, లేదా అన్నదే కొలమానం.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు,
కేంద్ర మాజీ మంత్రి