ఎంపీ అండతో తెలుగు తమ్ముడి వీరంగం

TDP Activist Eye On Single Women Assets in West Godavari - Sakshi

ఒంటరి మహిళ ఆస్తి కాజేసే కుట్ర

ఏలూరు ఎంపీ మాగంటి బాబు అండతో సతీష్‌  వేధింపులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు

పశ్చిమగోదావరి, నరసాపురం: తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అండతో రాష్ట్ర మంతటా తెలుగు తమ్ముళ్లు అనేక ఆగడాలు చేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జంగారెడ్డిగూడెంలో ఓ ఒంటరి మహిళ ఆస్తిని కాజేయడమే కాకుండా ఆమెను కొడుతూ దౌర్జన్యం చేస్తున్నాడు ఓ తెలుగుదేశం చోటా నాయకుడు. వరుసకు అత్త అని కూడా చూడకుండా ఎకరాల కొద్దీ ఆస్తి ఉన్నా ఆమెను రోడ్డుపై పడేశాడు. ఎంపీ మాగంటి బాబు అండ ఉండటంతో పోలీసులు కనీసం అతనిపై కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. మంగళవారం నరసాపురంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్‌ తరఫున చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.   

జంగారెడ్డిగూడెంకు చెందిన ఆండ్రు సీతారామయ్యకు అదే ప్రాంతానికి చెందిన భూలక్ష్మితో 1974లో వివాహమైంది. అయితే వీరికి సంతానం లేకపోవడంతో సీతారామయ్య తన సోదరుడు కుమార్తె కనకదుర్గను పెంచుకుని, జంగారెడ్డిగూడెంకు చెందిన నందిని సతీష్‌తో వివాహం చేశాడు. అధికారికంగా కనకదుర్గను దత్తత తీసుకోనప్పటికీ ఆమెకు వివాహం చేయడంతో పాటు, వాటాగా కొంత ఆస్తి ముట్టజెప్పాడు.

పెచ్చుమీరిన సతీష్‌ ఆగడాలు
2015లో సీతారామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే సీతారామయ్య 2010లోనే రిజిస్టర్‌ వీలునామా రాశాడు. తను పెంచుకున్న కుమార్తెకు అంతా సెటిల్‌ చేశానని, ప్రస్తుతం ఉన్న ఆస్తి తన భార్యకు చెందుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం భూలక్ష్మి పేరుపై 18 ఎకరాల భూమి, ఫ్లాట్, ఇన్నోవా కారు ఉన్నాయి. అయితే వాటిని సతీష్‌ స్వాధీనం చేసుకుని వేధిస్తున్నాడని భూలక్ష్మి పేర్కొంది. నెలకు రూ.3 వేలు ఇస్తాను అని చెబుతున్నాడని, అదేంటని అడిగితే కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది.

ఎంపీ మాగంటి బాబు చెప్పడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం లేదంది. ఎస్పీ, డీఎస్పీ, జిల్లా కలెక్టర్‌ వద్దకు కూడా తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని మహిళా కమిషన్‌ సభ్యురాలకు వివరించింది. ఫిర్యాదుపై రాజ్యలక్ష్మి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ భూలక్ష్మికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ అంశంపై మహిళా కమిషన్‌ అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారు. భూలక్ష్మి మాట్లాడుతూ పొలాల మీద సొసైటీల్లో అప్పులు అన్నీ తనపేరుమీదే ఉన్నాయని చెప్పింది. అప్పులు తీర్చుకోవడానికి కొంత పొలం అమ్ముకుందామన్నా, దౌర్జన్యం చేయిస్తున్నాడని వాపోయింది. 55 ఏళ్ల వయసులో తనను హింసిస్తున్నారని చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top