శక్తివంతమైన సాధనం మీడియా

Tammineni Sitaram Said Media Is A Power In Guntur - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

తాడేపల్లిలో ప్రెస్‌క్లబ్‌ ప్రారంభం

సాక్షి, తాడేపల్లి/గుంటూరు : రాజ్యాంగంలో నాల్గవ స్తంభంగా పిలిచే మీడియా అత్యంత శక్తివంతమైన సాధనమని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మీడియా పదును మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ సీతారాం మాట్లాడుతూ ఏ వార్తైనా వాస్తవంగా ఉంటేనే ప్రజల విశ్వసనీయత పొందుతుందని తెలిపారు. సోషల్‌ మీడియా ఎంత ఉపయోగిస్తున్నా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రాధాన్యత తగ్గలేదన్నారు. పత్రిక నిర్వహణ చాలా కష్టమని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పత్రికా రంగాన్ని కొనసాగిస్తున్నవారికి అభినందనలు తెలిపారు.

వ్యవస్థలను రక్షించుకోవాలంటే పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విలేకరులు దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కోవాల్సిన క్లిష్టపరిస్థితులు నేడు నెలకొన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పేది పాత్రికేయులేనన్నారు. వార్తను వార్తగా ఇచ్చే విధంగా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విలేకరుల సంక్షేమానికి తాను చేయూతనందిస్తానన్నారు. రాజధానిలో తొలి ప్రెస్‌క్లబ్‌ తాడేపల్లిలో ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ముందుగా ఆఫీస్‌ మెయిన్‌ గేటును జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ వెంకటాచార్యులు ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన ఎమ్మెల్యే ఆర్కే, విలేకరుల చాంబర్‌ను ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, కంప్యూటర్‌ రూమ్‌ను ఎమ్మెల్సీ ఏ.ఎస్‌.రామకృష్ణ, ప్రత్యేక రూమును వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాదె సుబ్బారెడ్డి, కార్యదర్శి టి.నాగేశ్వరరావు, కోశాధికారి టి.శివనాగిరెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top