వేసవి మంచినీటి ప్రణాళిక ఖరారు

Summer drinking water plan finalized - Sakshi

రూ.204 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల కార్యాచరణ

మొత్తం 8,407 నివాస ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా

వీటిలో 2,055 ప్రాంతాల్లో పశువులకు కూడా..

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా  3,103 ప్రాంతాల గుర్తింపు

సాక్షి, అమరావతి: ఈ ఏడాది వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం రూ.204.75 కోట్లతో ప్రణాళికను సిద్ధంచేసింది. జూన్‌ నెలాఖరు వరకు ఏయే ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు కార్యాచరణను రూపొందించారు.

ఇందుకోసం రాష్ట్రంలోని 13,065 గ్రామ పంచాయతీలను 48,363 నివాస ప్రాంతాలుగా వర్గీకరించారు. ఎండలు బాగా ఉండే రోజుల్లో గరిష్టంగా 8,407 నివాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని వారు అంచనా వేశారు. వీటిలో 2,055 ప్రాంతాలలో పశువులకూ తాగునీటి కొరత ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఆయాచోట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,103 ప్రాంతాలకు, ఆ తర్వాత వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో 1,064, 980 చొప్పున నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 

ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.185.99 కోట్లు
కాగా, ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.185.99 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని.. పంపు సెట్ల ద్వారా సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకులను నింపేందుకు రూ.5.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో ఉండే బావులను అద్దెకు తీసుకుని నీటిని తోడుకునేందుకు రూ.2.71 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. మరోవైపు.. బోర్ల లోతు పెంచడానికి, బావుల్లో పూడికతీత వంటి అవసరాలకు మరో రూ.10.25 కోట్లు దాకా ఖర్చవుతుందని తేల్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top