పెట్రోలు బాటిళ్లతో తహసీల్దార్‌ కార్యాలయాలకు

Suicide attempts in two places in the state - Sakshi

రెండు చోట్ల ఆత్మహత్యాయత్నాలు

స్థల వివాదాన్ని పరిష్కరించలేదని ఆళ్లగడ్డలో రైతు దంపతులు..

వన్‌బీ చేయలేదని ఆవేదనతో కురబలకోటలో యువరైతు..  

ఆళ్లగడ్డ/ కురబలకోట (చిత్తూరుజిల్లా): తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థల వివాదాన్ని పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని మనస్తాపానికి గురైన దంపతులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. బత్తలూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి తన స్థలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిరిగి ఇప్పించాలంటూ సుమారు 20 ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బుధవారం భార్యను వెంటబెట్టుకుని పెట్రోలు బాటిల్‌తో వచ్చి తహసీల్దార్‌ శివరాముడుతో వాగ్వాదానికి దిగారు.
పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చి తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న వెంకటసుబ్బారెడ్డి దంపతులు  

ఈ క్రమంలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న నిబంధనల ప్రకారం ధ్రువీకరణ చేసి ఇచ్చామని, ఆర్డీఓ వద్దకు కానీ, కోర్టుకు కానీ వెళ్లి పరిష్కరించుకోవలసిందిగా సూచించామన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని దయ్యాలవారిపల్లెకు చెందిన డి.నరసింహారెడ్డి బుధవారం ఇలాగే తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు.

తండ్రి పేరిట ఉన్న భూములకు వన్‌బీ చేయాల్సిందిగా రెండేళ్లుగా తిరుగుతున్నా ఆధికారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో బుధవారం పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నాడు. భూములు ఆన్‌లైన్‌ చేస్తారా.. చచ్చిపోమంటారా? అంటూ పెట్రోలు పోసుకున్నాడు.  గమనించిన పోలీసు పరుగున వెళ్లి అడ్డుకున్నాడు. దీనిపై తహసీల్దార్‌ స్పందిస్తూ మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటే వన్‌బీకి సిఫారసు చేస్తామని, రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు వెనుదిరిగాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top