ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు విమర్శించారు.
- ఇంటికో ఉద్యోగం హామీకి కట్టుబడాలి
- డీఎస్సీకి డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలి
- కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయిన విద్యార్థులు
- పోలీసుల లాఠీచార్జి.. పలువురి అరెస్టు
కర్నూలు(న్యూసిటీ): ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు విమర్శించారు. డీఎస్సీ-2014లో డీఎడ్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు స్థానిక సి.క్యాంప్ నుంచి మద్దూరునగర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ధర్నానుద్దేశించి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.
ఇంటికో ఉద్యోగం మాటకు బాబు కట్టుబడాలని.. ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం కల్పించకపోతే రెండు సంవత్సరాలు వృథా అవుతాయనే విషయం గ్రహించాలన్నారు. 2008లో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీలో ఛాత్రోపాధ్యాయులకు అవకాశం కల్పించిందన్నారు. రానున్న డీఎస్సీలో వీరికి అవకాశం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అనంతరం విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులు జి.రంగన్న, ఎం.మనోహర్, రమేష్, సోమన్నలను అరెస్టు చేసి మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి ఎం.మనోహర్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి రమేష్, ఏఐఎస్‌ఎఫ్ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న, నాయకులు రామానాయుడు, రాజు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.