తాగుబోతు అధ్యాపకులు మాకొద్దు

Students Protest Against Professors In Srikakulam - Sakshi

తొలగించాలంటూ నౌపడ గ్రామస్తుల ధర్నా

శ్రీకాకుళం, సంతబొమ్మాళి: విద్యాబుద్ధులు, విజ్ఞానాన్ని అందించాల్సిన అధ్యాపకులే పూటుగా మద్యం సేవించి కళాశాల పరువు తీయడంపై ఆ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. తాగుబోతు అధ్యాపకులను తొలగించాలంటూ నౌపడ గ్రామస్తులు, ప్రజావేదిక సభ్యులు సోమవారం రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని అధ్యాపకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్, అధ్యాపకులతో మాజీ సర్పంచ్‌ పి.రవికుమార్‌రెడ్డి, ప్రజావేదిక సభ్యులు, గ్రామస్తులు సమావేశమయ్యారు. మద్యం సేవించి విద్యార్థులతో డ్యాన్స్‌లు చేయడమే కాకుండా విలేకరి సంతోష్‌పై బండ బూతులు తిట్టడం అధ్యాపకులకు తగునా అని ప్రశ్నించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అధ్యాపకులు వాడిన భాష ఉండడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రేపు మా పిల్లలకు రక్షణ ఏమిటని, ప్రస్తుతం జరిగిన దానిపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్‌ను గ్రామస్తులు ప్రశ్నించారు.

ఈ ఒక్క దానిని క్షమించాలని వీలైతే అధ్యాపకులకు మెమో ఇస్తామని ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్‌ అనడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరమైన తప్పిదం చేసిన అధ్యాపకులు ఎస్‌.షణ్ముఖరావు, ఎల్‌.ఎల్‌.స్వామి, కె.శ్యామలను విధుల నుంచి తొలగించడానికి మీ పై అధికారులకు నివేదికలు పంపాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన నౌపడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు తాగుబోతు అధ్యాపకుల అసభ్యకర ప్రవర్తనతో మాయని మచ్చ ఏర్పడిందన్నారు. ఉద్యోగులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్లిపోతారు, మా కళాశాల పరిస్థితి, మా పిల్లల భవిష్యత్‌ ఏమిటంటూ గ్రామస్తులు నిలదీశారు. దీనిపై స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్‌ జిల్లా వృత్తి విద్యాధికారి, ఆర్‌జేడీకి ఫిర్యాదు చేస్తానని, తాగి అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని, తాత్సారం చేస్తే గ్రామస్తులందరం కళాశాల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి టెక్కలి సీఐ టి.శ్రీనివాసరావు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడా రు. కళాశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, క్రమశిక్షణా రాహిత్యంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. దీంతో శాంతించిన గ్రామస్తులు వెనుదిరి గారు. కార్యక్రమంలో ప్రజావేదిక సభ్యులు, గ్రామస్తులు జె.అప్పలరాజు, ఎం.రాజు, కె.నాగిరెడ్డి, పి.రాజేష్, ఎల్‌.లింగరాజు, ఎస్‌.నవీన్‌కుమా ర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top