‘నారాయణ’  దాష్టీకం

Students, parents protest Narayana Junior college in Anantapur - Sakshi

అనంతపురం‌: విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను సాకుగా చూపి నారాయణ కళాశాల అధ్యాపకులు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన సోమవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగర శివారులోని టీవీ టవర్‌ వద్ద నారాయణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో సోమవారం రాత్రి జూనియర్, సీనియర్‌ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. రాత్రి భోజన సమయంలో మెస్‌హాల్లో టేబుల్‌ విషయంలో గొడవ పడ్డారు. సీనియర్లకు ఎదురు చెప్పినందుకు జూనియర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం యాజమాన్యం దృష్టికి పోవడంతో రాత్రి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గొడవకు పాల్పడ్డారనే కారణంతో యశ్వంత్, మరో విద్యార్థిని కట్టెతో కొట్టారు. దీంతో వాతలు పడ్డాయి. 

ఈ విషయం కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి పోవడంతో మంగళవారం ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేయాలని, కళాశాలను వెంటనే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వంట మనుషులు, పని మనుషులతో తమను గొడ్డును కొట్టినట్లు కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు ప్రిన్సిపాల్‌ శిఖామణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ నారపరెడ్డి, ఏజీఎం సుధాకర్‌రెడ్డి, వార్డెన్‌ భవాని ప్రసాద్‌లపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top