మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

student committed suicide in Kakinada - Sakshi

కాకినాడ: ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల సమక్షంలో సహచర విద్యార్థి తల్లిదండ్రులు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన అతడి బంధువులు స్కూల్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. చివరకు దిగివచ్చిన యాజమాన్యం రూ.5.50 లక్షలు పరిహారంగా చెల్లించడంతో వివాదానికి తెరపడింది. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. కాకినాడ శశికాంత్‌ నగర్‌ సమీపంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో కనపర్తి యువకిషోర్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఏడో తరగతి విద్యార్థితో వివాదం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో యువకిషోర్‌ను మరో విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ఆవరణకు పిలిపించి గట్టిగా మందలించి చేయి చేసుకొన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకిషోర్‌ మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లకుండా రాజేశ్వరినగర్‌లోని ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సమాచారం తెలుసుకొన్న తల్లి సత్యవేణి, తండ్రి రాంబాబులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

దీంతో విషయం తెలుసుకున్న బంధు మిత్రులు మృతదేహంతో స్కూల్‌ ఆవరణకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడ ఫర్నిచర్‌ను మరికొన్ని వస్తువులను దగ్ధం చేశారు. పోలీసులు విద్యాశాఖాధికారులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వివాద సమాచారం తెలుసుకొన్న యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపింది. సిబ్బంది కూడా గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకొన్న యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థి బంధువులతో చర్చించింది. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పి రూ. 5.50 లక్షలు పరిహారంగా అందజేసి వివాదానికి ముగింపు పలికింది. వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో విద్యలో రాణించలేక మనస్తాపంతో ఉరివేసుకొన్నట్టుగా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top