
పంచాయతీరాజ్ మరింత పటిష్టం
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
- పునర్వ్యవస్థీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో పంచాయతీరాజ్ విభాగం మరింత బలోపేతం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆ శాఖలోని పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ విభాగం (పీఆర్‌ఐ), పంచాయతీరాజ్ ఇంప్లిమెంట్ యూనిట్ (పీఐయూ) ఏకం కానున్నాయి.
2007 వరకూ ఒకటిగానే ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని, అప్పటి పని సౌలభ్యం దృష్ట్యా రెండుగా విభజించారు. ఆయా విభాగాల్లో ఉన్న పనిభారం మేరకు ఉద్యోగులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంజీఎస్‌వై, నాబార్డు తదితర ప్రాజెక్టుల బాధ్యతలను పీఐయూకు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే కార్యక్రమాల బాధ్యతను పీఆర్‌ఐ విభాగానికి అప్పగించారు. ప్రారంభంలో ఈ రెండు వ్యవస్థలకు సరిపడా ప్రాజెక్టులు ఉండగా... కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా నిధులు గానీ, ప్రాజె క్టులుగానీ రాని నేపథ్యంలో పీఐయూ విభాగానికి అంతగా పనిలేకుండా పోయింది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టడంతో పీఆర్‌ఐ వ్యవస్థకు పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది కొరతను అధిగమించేందుకు రెండు వ్యవస్థలను ఏకం చేయాలని నిర్ణయించి... తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
పీఆర్ ఇంజనీరింగ్ వ్యవస్థలను రెండింటినీ ఏకం చేయడం ద్వారా పంచాయతీరాజ్ విభాగం మరింత బలోపేతం కానుంది. పీఐయూలో ప్రస్తుతం ఉన్న 43 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 206 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 1,065 మంది ఏఈ/ఏఈఈలు పీఆర్‌యూ విభాగానికి జత కాబోతున్నట్లు సమాచారం.