ఉనికికోసం వెంపర్లాట | Strategies and policies for the existence | Sakshi
Sakshi News home page

ఉనికికోసం వెంపర్లాట

Feb 25 2014 1:38 AM | Updated on Aug 14 2018 5:54 PM

ఉనికికోసం వెంపర్లాట - Sakshi

ఉనికికోసం వెంపర్లాట

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ నాయకులు ఉనికికోసం నానా పాట్లు పడుతున్నారు. విలువలు, విశ్వసనీయతను పక్కనపెట్టి..

  • డీలాపడిన అధికార పక్షం
  •  పదవి కావాలంటే పక్క పార్టీనే దిక్కు
  •  గోడ దూకుతున్న జిల్లా నేతలు
  •  చంద్రబాబుతో వ్యాస్ కొడుకు మంత్రాంగం
  •  సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ నాయకులు ఉనికికోసం నానా పాట్లు పడుతున్నారు. విలువలు, విశ్వసనీయతను పక్కనపెట్టి.. పదవే పరమావధిగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ కావడంతో ఆ పార్టీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకోసం ఇతర పార్టీలవైపు దృష్టిసారించారు. పదవుల కోసం వైఎస్సార్ సీపీలో చేరేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరి ప్రయత్నంగా ‘సైకిల్’ ఎక్కేందుకు తహతహలాడుతున్నారు. ఇన్నాళ్లు వారిని నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నారు.

    ఈ కోవలోకే జిల్లాకు చెందిన పీసీసీ కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్ తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం ఇటీవలి కాలంలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో వేదవ్యాస్ కుమారుడు కిషన్‌తేజ్ శనివారం లోకేష్ ద్వారా చంద్రబాబునాయుడును కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికాలో చదువుకున్న కిషన్‌తేజ్ తన మిత్రుల సాయంతో లోకేష్‌కు దగ్గరైనట్లు సమాచారం. చంద్రబాబును కిషన్‌తేజ్ కలిసిన సమయంలో బందరు పార్లమెంటు టికెట్ తన తండ్రి వ్యాస్‌కు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.  

    కాపు సామాజికవర్గానికి ఉన్న ఓట్లు, ఆ వర్గంలో తమకు ఉన్న పట్టు, జిల్లాలో వేదవ్యాస్‌కు ఉన్న పరిచయాలు, పరపతిని తమకు అనుకూలంగా ప్రస్తావిస్తూ బాబుకు ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే బందరు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణకు టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం కూడా  వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. బాడిగ రామకృష్ణకన్నా తమకే పరపతి ఎక్కువ ఉందని, టికెట్ ఇస్తే ఖర్చులు కూడా తామే భరించి సీటు గెలుస్తామని ధీమా వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమాచారం.

    అవసరమైతే కొనకళ్లకు నచ్చజెప్పి పెడనఎమ్మెల్యేగా పోటీ చేయించి ఎంపీ టికెట్ తన తండ్రికి అవకాశం ఇచ్చేలా చూడాలని  కిషన్‌తేజ్  ప్రతిపాదించినట్లు వినికిడి. చంద్రబాబు స్పందిస్తూ ఎంపీ సీటు కాకుండా జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తారా.. అని ప్రశ్నించగా తన తండ్రికి ఎంపీ టికెట్టే కేటాయించాలని కిషన్‌తేజ్ కోరారు. అంతా విన్న బాబు ప్రస్తుతానికి వ్యాస్ చేరిక అంశాన్ని వాయిదా వేసేలా మాట్లాడారని తెలిసింది. ప్రస్తుతం బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితి బాగుండనప్పటికీ ఎంపీ సీటుపై  అధినేత వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

    ఐదేళ్లలో ఎన్ని మార్పులో..
     
    కాంగ్రెస్‌లో పలు కీలక పదవులు అనుభవించిన వ్యాస్ ప్రజారాజ్యంలో చేరడం, బందరు నుంచి పోటీ చేయడం రెండూ చారిత్రక తప్పిదాలేనంటూ ఇటీవల తన అనుయాయుల వద్ద మధనపడినట్లు సమాచారం. ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న ఆయన కాంగ్రెస్ ఖాళీ కావడంతో పదవుల కోసం పార్టీలు మారేందుకు సైతం సిద్ధం కావడాన్ని ఆయన అనుయాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ డెప్యూటీ స్పీకరుగా, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వేదవ్యాస్ 2009లో పీఆర్పీ తీర్ధం పుచ్చుకుని బందరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు.

    పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం పెడన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగానూ, పీసీసీ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా వేదవ్యాస్ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వాదనలు గుప్పుమంటున్నాయి.  
     
    మాజీ మంత్రి నడకుదుటితో బాబు మంతనాలు..


    వేదవ్యాస్ కుమారుడితో మాట్లాడిన అనంతరం చంద్రబాబు.. బందరు నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మత్స్యశాఖ మంత్రిగా పనిచేసిన నడకుదుటి నరసింహారావును  పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. నరసింహారావు అల్లుడైన కొల్లు రవీంద్ర 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా రవీంద్ర పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూరగడ్డ వేదవ్యాస్ టీడీపీలో చేరిక తదితర అంశాలపై  నరసింహారావుతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు రోజులుగా నరసింహారావు హైదరాబాదులోనే ఉన్నారు. రవీంద్రకూడా సోమవారం హైదరాబాదులో జరిగిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement