ఆగని వన్యప్రాణుల వేట | Stop wildlife hunting | Sakshi
Sakshi News home page

ఆగని వన్యప్రాణుల వేట

Oct 25 2013 2:46 AM | Updated on Oct 3 2018 5:26 PM

పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాటుబాంబుల మోత, తుపాకి చప్పుళ్లు ఎక్కువయ్యూయి.

 

=కౌండిన్య అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల మోత
 =ఉచ్చుల్లో ఇరుక్కుంటున్న జంతువులు
 =పశువులు, మేకల కాపరుల ప్రాణాలకు అపాయం
 =నిద్రావస్థలో అటవీశాఖ

 
పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాటుబాంబుల మోత, తుపాకి చప్పుళ్లు ఎక్కువయ్యూయి. అడవిలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోంది. వేటగాళ్ల నాటు తుపాకులకు  పశువులు, మేకల కాపరులు, తేనె సేకరణకు వెళ్లే గిరిజనుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అడవిలో అమర్చిన నాటు బాంబులను తొక్కడం, కొరకడంతో జంతువులు మృత్యువాతపడుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చుల్లో ఎన్నో జంతువులు ఇరుక్కుంటున్నాయి. నిఘా కొరవడడంతో వేటగాళ్లు  అటవీ ప్రాంతాల్లో వీరవిహారం చేస్తున్నారు.
 
పలమనేరు/ వి.కోట, న్యూస్‌లైన్: పలమనేరు మండలం నుంచి బెరైడ్డిపల్లె, వి.కోట మండలం వరకు కౌండిన్య అభయారణ్యం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణంగా తమిళనాడులోని మోర్ధన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో పదుల సంఖ్యలో ఏనుగులు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులున్నాయి. ఈ అడవిని ఆనుకుని దాదాపు 60 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని కొందరు నిత్యం అడవికి వేటకెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు.

ఈ ప్రాంతంలో వెయ్యి వరకు నాటు తుపాకులున్నట్లు అనధికార సమాచారం. గతేడాది పలమనేరు సర్కిల్ పోలీసులు జరిపిన దాడుల్లో వందలాది తుపాకులు పట్టుబడిన విషయం తెలిసిందే. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దొరికింది కొన్నే అయినప్పటికీ, భారీ సంఖ్యలో ఇవి వేటగాళ్ల వద్ద ఉన్నట్లు సమాచారం. వేటగాళ్లు పగలు, రేయి అన్న తేడా లేకుండా అడవిలో వన్య ప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లు నాటు తుపాకులతో గుంపులుగుంపులుగా వె ళ్లడం ఇక్కడి రివాజు. కొందరు నాటు బాంబుల్లో వన్య ప్రాణులకు ఇష్టమైన పదార్థాలను ఉంచి అడవిలో పెట్టి వస్తుంటారు. వీటిని జంతువులు తినేటపుడు బాంబు పేలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి.

ఇలా చనిపోయిన వాటిని మరుసటి రోజు వెళ్లి వేటగాళ్లు తీసుకొస్తుంటారు. ముఖ్యంగా ఈ నాటు బాంబులను కొరికి  రెండు నెలల్లో 30 కుక్కల దాకా మృత్యువాత పడ్డాయి. రెండ్రోజుల క్రితం పలమనేరు మండలం కృష్ణాపురం అడవిలో కొందరు వేటగాళ్లు భారీగా నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వచ్చారు. ఓ ఉండను తిన్న అడవిపంది తల ముక్కలైంది. ఆ అడవిపందిని వేటగాళ్లు తీసుకెళ్లారు. దీనిపై అటవీశాఖ విచారణ జరుపుతోంది. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులను కొందరు పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. ఇరుక్కున్న జంతువుల మాంసాన్ని తీసుకువస్తున్నారు.
 
భయం గుప్పిట్లో పశువుల కాపరులు

నాటు తుపాకులతో అమాయకులకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో బెరైడ్డిపల్లె మండలంలోని దేవదొడ్డి అటవీ ప్రాంతంలో వేటగాళ్ల నాటుతుపాకుల దెబ్బకు పశువులకాపరి మృతిచెందాడు. రెండేళ్ల క్రితం పలమనేరు మండలంలోని కల్లాడు వద్ద ఓ వ్యక్తి మరణించాడు. రెండు నెలల క్రితం బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడు తేనె తీస్తుండగా వేటగాళ్ల  నాటు తుపాకి దెబ్బకు గాయపడ్డాడు. నలుగురికి పైగా తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ బయటకు పొక్కని మరెన్నో అడవిలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి.  ఇప్పటికైనా అటవీశాఖ కళ్లు తెరచి తగిన చర్యలు తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement