తవ్వకాల్లో బయటపడిన కుండలు , తవ్వకాలు జరుపుతున్న అటవీశాఖ సిబ్బంది
గిద్దలూరు నల్లమల రిజర్వు ఫారెస్టులో గుప్త నిధుల తవ్వకాలు
కోట్ల రూపాయలు విలువజేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్న కుండలు బయటపడినట్లు సమాచారం
ప్రభుత్వానికి అప్పజెప్పకుండా వాటాలు వేసి పంచుకున్న అటవీ సిబ్బంది
హైదరాబాదులో టెస్టింగ్.. బెంగళూరులో అమ్మకాలు
మార్కాపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
మార్కాపురం: అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులే అడవిలో అభించిన గుప్త సంపదను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, వజ్రాలు, నవరత్నాలతో కూడిన రెండు కుండలు తవ్వకాల్లో బయటపడగా వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా వాటాలు వేసుకుని పంచుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల అభయారణ్యం పరిధిలో ఫిబ్రవరి మొదటి వారంలో జరగ్గా రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.
ఇందులో అటవీశాఖ అధికారులే పాత్రధారులుగా వ్యవహరించడం గమనార్హం. గుప్త నిధులు తవ్వే ముఠాతో చేతులు కలిపి అటవీశాఖ ఉద్యోగులే గడ్డపార పట్టి గుంతలు తీసి గుప్తనిధులను వెలికితీసి ప్రభుత్వానికి అప్పగించకుండా వారే వాటాలు వేసుకుని పంచుకోవడం సంచలనంగా మారింది. గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని తురిమెళ్ల రేంజ్, ఆర్‌వీటికోట సెక్షన్ ఎర్రగుంట్ల లొకేషన్‌లో గుప్తనిధులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు ఫిబ్రవరిలో సమాచారం అందింది.
ఈ సమాచారం అక్కడ పనిచేసే నలుగురు ప్రొటెక్షన్ వాచర్స్, ఒక రేంజ్ అధికారికి తెలియడంతో గుప్తనిధులను కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. అటవీ ప్రాంతంలో పనులు జరుగుతుండడంతో, వాటిని ఆసరాగా చేసుకుని అర్ధవీడుకు చెందిన ఒక వ్యక్తితో జేసీబీ తెప్పించుకుని తవ్వకాలు చేపట్టారు. రెండు పెద్ద కుండలు బయటకు తీశారు. అందులో బంగారం, వజ్రాలు, నవరత్నాలతో కూడిన విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
ప్రభుత్వానికి అప్పగించకుండా.. వాటాలేసుకుని..
నిజానికి ఈ వస్తువులను, బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన అటవీశాఖ బీట్ అధికారులు, వాచర్లు, రేంజ్ ఆఫీసర్లు ఒక్కటై అవి నిజమైనవా ? నకిలీవా అని తెలుసుకునేందుకు హైదరాబాదుకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించి స్వచ్ఛమైన బంగారం, తరువాత విలువైన వజ్రాలు, నవరత్నాలుగా నిర్ధారించుకున్నారు. దీంతో వాటిని అక్కడ అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో బెంగళూరుకు వెళ్లి విక్రయించినట్లు సమాచారం.
ఈ సంఘటన జరిగిన తరువాత ఒక బీట్ ఆఫీసరు గిద్దలూరులో ఇంటిని కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే అటవీ సిబ్బందే గుంతలు తవ్వుతున్న ఫొటోలు, దొరికిన కుండల ఫొటోలు సోషల్‌మీడియాలో రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా బుధవారం ఈ సమాచారం తెలుసుకున్న గిద్దలూరు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి, సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


