గ్రీవెన్స్ సెల్.. గొడవ గొడవ.. | Stir Stir grievance cell .. .. | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్ సెల్.. గొడవ గొడవ..

Mar 24 2015 3:04 AM | Updated on Apr 8 2019 6:46 PM

రైల్వేకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం రసాభాసగా మారింది. మైసూరువారిపల్లె పంచాయతీ సర్వే...

తహశీల్దార్‌తో ఫిర్యాదుదారుల వాగ్వాదం.. తోపులాట..
 
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం రసాభాసగా మారింది. మైసూరువారిపల్లె పంచాయతీ సర్వే నెంబర్ 1596, 1582లో తమకు రెండు ఎకరాల 12 సెంట్ల భూమి ఉందని, ఆ భూమిలో దారి ఏర్పాటు విషయం గురించి బీసీ పుల్లయ్య అనే వ్యక్తితో పాటు అతని కుమారులు బాబు, రమేష్ తహశీల్దార్ గౌరీశంకర్‌రావుతో వాదనకు దిగారు. మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం తమ పొలం పక్కనే ఉన్న నూకా వెంకటయ్య తమ పొలంలో ఉన్న రాళ్లను జేసీబీతో తొలగించినా మీరెందుకు పట్టించుకోలేదని అడిగారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ భూమి సమస్య కోర్టులో ఉన్నందున పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాలని సూచించారు. ఇంతలో తహశీల్దార్ తనకు కడపలో మీటింగ్ ఉందంటూ బయలుదేరేందుకు సిద్ధపడగా వారు అడ్డగించారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి తోసుకున్నారు. ఈ సమయంలో బాధితుడు బీసీ పుల్లయ్య కిందపడిపోయాడు. తహశీల్దార్ కొట్టడంతో తమ తండ్రి కిందపడిపోయాడంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన అతని కుమారులు తహశీల్దార్‌పై పాదరక్షతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న సిబ్బంది వారిని విడదీశారు.

అయితే అక్కడే ఉన్న సర్వేయర్ త్యాగరాజు ప్రజలను కొట్టే అధికారం మీకు ఎక్కడ ఉందని తహశీల్దార్‌ను నిలదీశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర కూడా తహశీల్దార్‌తో వాదనకు దిగారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని బీసీ పుల్లయ్య, అతని కుమారులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు పోలీసు స్టేషన్‌లో తహశీల్దార్‌పై ఫిర్యాదు చేయగా కోర్టునుంచి అనుమతి వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామన్నారు.
 
బాధితుల నిరసన
 అనంతరం బాధితులు తమకు న్యాయం చేయాలంటూ  స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నిరసన తెలియజేస్తున్న వారిని పరామర్శించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కాగా, సాయంత్రం తహశీల్దార్ గౌరిశంకర్‌రావు, ఎంపీడీఓ కృష్ణయ్య, మండల అధికారులు, ఎన్‌జీఓ సంఘం సభ్యులంతా కలిసి స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు ఓబులేసు, అసోసియేట్ అధ్యక్షుడు చంద్రమౌళిరాజు మాట్లాడుతూ తహశీల్దార్‌కు పూర్తివ ుద్దతు ఇస్తున్నట్లు  తెలిపారు.
 
నేను కొట్టలేదు: తహశీల్దార్
 ఈ సందర్భంగా తహశీల్దార్ గౌరిశంకర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులందరూ ఉన్నప్పటికీ వారు అసభ్య పదజాలంతో మాట్లాడారని, ఒక మండల మెజిస్ట్రేట్‌ను ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. తాను బయటకు వెళ్తుంటే పుల్లయ్య అడ్డుపడ్డాడని తెలిపారు. కడపకు మీటింగ్‌కు వెళ్లాలని పక్కకు జరగమని అతన్ని తోశానని, అంతే తప్ప తాను కొట్టలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement