కరుణించు ప్రభూ! | Sakshi
Sakshi News home page

కరుణించు ప్రభూ!

Published Thu, Feb 26 2015 12:45 AM

Srikakulam district give Demand special zone

        నేడే బడ్జెట్ రైలు రాక
     జిల్లాకు బెర్తు దొరుకుతుందో.. లేదో..
      పజాప్రతినిధుల ప్రతిపాదనలు ఏమవుతాయో..
     కొత్త రైళ్లు.. సౌకర్యాలపై జిల్లావాసుల ఆశలు
     ఒడిశా పెత్తనం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్

 

మరో బడ్జెట్ రైలు వస్తోంది. ఈసారైనా ఈ రైలు జిల్లాలో ఆగుతుందా లేక ఎప్పటిలాగే దూసుకుపోతుందా!.. అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకోవడం.. దాన్ని ఒడిశా వ్యతిరేకించడం.. ప్రత్యేక జోన్ ఇవ్వడం తప్పనిసరైతే శ్రీకాకుళం జిల్లాను ఈస్‌కోస్టు జోన్‌లోనే ఉంచాలనే కొత్త పల్లవి ఎత్తుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జోన్‌లో ఉంటూ ఇప్పటికే ఎంతో అన్యాయానికి గురవుతున్న జిల్లాకు ఈస్ట్‌కోస్ట్ నుంచి విముక్తి కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఎప్పుడూ నిరాశే కలిగిస్తున్నా.. ఈసారైనా ఆకాంక్షల నిధులు మోసుకొస్తుందేమోనన్న ఆశతో రైల్వే బడ్జెట్ కోసం జిల్లా ప్రజలు  ఎదురుచూస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్ సమర్పించనున్న తరుణంలో జిల్లాలో రైల్వేల పరిస్థితి చూస్తే.. ఏమున్నది గర్వకారణం అనిపించకమానదు. ఒడిశాలోని ఈస్ట్‌కోస్టు జోన్ పరిధిలోనూ.. అందులోని జిల్లాలోని సగం ప్రాంతం ఖుర్దా డివిజన్‌లో ఉండటంతో సౌకర్యాలన్నీ ఒడిశాకు తరలించుకుపోతూ.. అధిక ఆదాయం సంపాదిస్తున్న జిల్లాలోని స్టేషన్లపై ఉన్నతాధికారులు సవతి ప్రేమ చూపుతున్నారు. జిల్లాలోని పలాస స్టేషన్ ఏ గ్రేడ్ కాగా, ఆమదాలవలస, ఇచ్ఛాపురం స్టేషన్లను బీ గ్రేడ్‌గా గుర్తించారు. అయినప్పటికీ గ్రేడ్ల వారీ సౌకర్యాల కల్పనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం జిల్లా విద్యార్థులు భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తోంది.
 
 చాలా సందర్భాల్లో ఒడిశా అభ్యర్థులు ఇక్కడినుంచి వెళ్లేవారిని పరీక్షలకు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒడిశా పెత్తనం వల్ల ఏళ్ల తరబడి వాల్తేరు ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. జిల్లాకు సంబంధించి అదనపు రైళ్లు, హాల్టులు, గేట్‌మెన్ లేని లెవల్ క్రాసింగులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పొందూరు-రాజాం రైల్వే లైను.. వంటి ఎన్నో డిమాండ్లు ఏళ్ల తరబడి ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్), పలాస, ఇచ్ఛాపురం స్టేషన్ల నుంచి ఏటా వందల కోట్ల ఆదాయం లభిస్తున్నా ఆ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపడం లేదు. గత బడ్జెట్ ఒక్క ప్యాసింజర్ రైలుకే పరిమితమైంది. పలాస వంటి ప్రధాన స్టేషన్ల సమీపంలో రైల్ ఓవర్ బ్రిడ్జి, వికలాంగులకు ఎలివేటర్లు, మౌలిక సదుపాయాల కల్పన కలగానే మిగిలిపోయింది.
 
 ఏపీలో చివరి జిల్లాగా, వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు మరిన్ని రైళ్లు అవసరం. అదే విధంగా కోణార్క్, హౌరా వంటి రైళ్లలో బెర్తులన్నీ ఒడిశాలోనే నిండిపోతున్నాయి. ముంబై, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లడానికి నెల రోజుల ముందు ప్రయత్నించినా బెర్త్‌లు దొరకని పరిస్థితి. విశాఖ, ప్రశాంతి రైళ్లను భువనేశ్వర్ వరకు పొడిగించుకున్నారు. దీంతో ఇక్కడి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్నాళ్లలో ఏపీకి కొత్త రాజధాని రానుంది. ఆ ప్రాంతానికి ఇచ్ఛాపురం నుంచి ఓ ప్యాసింజర్ రైలు వేయాలని జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రతిపాదించారు. అదైనా మంజూరవుతుందో లేదో చూడాలి.
 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement