ఆంక్షల దారి...!

Speed Limits Oon Thirumala Ghat Road - Sakshi

చిరుత దాడి నేపథ్యంలో పలు ఆంక్షలు!

టీటీడీ ఫారెస్ట్‌ అధికారుల ప్రతిపాదన

సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టీటీడీ

మొదట సూచిక బోర్డులు, అవగాహనకే ప్రాధాన్యం

ఫారెస్ట్‌ సూచనలు తక్షణం అమలు చేయబోమని స్పష్టీకరణ

భక్తుల భద్రతే లక్ష్యంగా ఫారెస్ట్‌ అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఘాట్‌ రోడ్లలో సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేయాలని సూచించారు. అలాగే రాత్రి ఏడు నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు నడకదారులు మూసివేయాలని ప్రతిపాదించారు. వాహనాల వేగానికీ కళ్లెం వేయాలని నిర్ణయించారు. మూడు రోజుల క్రితం భక్తులపై చిరుత దాడి నేపథ్యంలో ఈ ఆంక్షలను ప్రతిపాదించారు. దీనిపై టీటీడీ ఆచితూచి అడుగులేస్తోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. 

అసలు ఏం జరిగిందంటే..
గత ఆదివారం రాత్రి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో తండ్రీ కూతురు స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా తొమ్మిదో కిలోమీటరు వద్ద ఒక్కసారిగా తండ్రిపై చిరుత దాడి చేసింది. కుమార్తెపై దాడికి యత్నించింది. పది నిమిషాల తరువాత అదే దారిలో వచ్చిన భార్యాభర్తలపైనా దాడి చేసింది. అలాగే మరికొన్ని వాహనాలపై దాడికి ఉప్రకమించింది.

సాక్షి, తిరుమల: సప్తగిరీశుని దర్శనార్థం దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. కాలినడకన కొందరు, రోడ్డు మార్గాన మరికొందరు కలియుగ వైకుంఠానికి చేరుకుంటుంటారు. వీరి భద్రతకు టీటీడీ, ఫారెస్ట్, విజిలెన్స్‌ పెద్ద పీట వేస్తోంది. ఇటీవల తిరుమలలో భక్తులపై చిరుత దాడి నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యింది. నడకదారుల్లో, ఘాట్‌ రోడ్లల్లో కొన్ని ఆంక్షలు విధించాలని ఫారెస్ట్‌ సూచించింది. దీనిపై టీటీడీ అధికారులు ఆచీతూచీ అడుగులేస్తున్నారు.
 
భక్తుల భద్రతే లక్ష్యం
భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ ఫారెస్ట్‌ అధికారులు అడుగులేస్తున్నారు. చిరుతదాడి నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఘాట్‌ రోడ్లలో ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను విజిలెన్స్, పోలీసు సిబ్బందికి అందించారు.

ప్రతిపాదనలు ఇలా..
టీటీడీ విజిలెన్స్, అర్బన్‌ పోలీసుల ముందు అటవీశాఖ పలు ప్రతిపాదనలు ప్రతిపాదించింది. ఇందులో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్‌ రోడ్లలో అనుమతించరాదని ప్రతిపాదించింది. అలాగే నడక మార్గాలను రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించింది. ఘాట్‌ రోడ్లలో వేగ నియంత్రణకూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఘాట్‌ రోడ్లలో వాహనాలు 20కి.మీ వేగాన్ని మించకుండా ప్రయాణం చేయాలని సూచించింది. సమీక్షలో టీటీడీ విజిలెన్స్‌ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, టీటీడీ ఫారెస్ట్‌ డీఎఫ్‌ఓ ఫణికుమార్, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్, గవర్నమెంట్‌ ఫారెస్ట్‌ అధికారి, ఎఫ్‌ఆర్‌ఓ సుబ్బారాయుడు పాల్గొన్నారు.
 
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న టీటీడీ
ఫారెస్ట్‌ అధికారుల సూచనల అమలుపై టీటీడీ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ఘాట్‌ రోడ్లలో ఆంక్షలను పరిశీలిస్తోంది. ముందుగా చిరుత పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిత్యం పెట్రోలింగ్, ఘాట్‌ రోడ్లకిరువైపులా వాహనాలను పార్కింగ్‌ చేయకుండా, పిట్టగోడ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫారెస్ట్, విజిలెన్స్‌ సూచనలు తక్షణం అమలు చేయలేమని, భక్తులను చైతన్యపరిచి వన్యమృగాల దాడుల నుంచి కాపాడాలని భావిస్తోంది. 

ఆంక్షలు విధిస్తే భక్తులకు ఇబ్బందే!
భద్రత పేరున ఫారెస్ట్‌ అధికారుల సూచనలతో ఆంక్షలు విధిస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్విచక్రవాహనాల్లో స్థానికులే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారని, ఇప్పటికే వారికి వన్యమృగాల దాడి, రక్షణపై కొంత అవగాహన ఉందని అంటున్నారు. నడక మార్గాలు మూసివేస్తే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని, వేసవి, వర్షాలప్పుడు తిప్పలు తప్పవని చెబుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top