'గిరి' గడపకు పండుగ

Special Story On Prakasam district Palutla Thanda - Sakshi

(ఎన్‌. మాధవరెడ్డి, ఒంగోలు)
దట్టమైన నల్లమల. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలు సంచరించే ప్రాంతం. కొండలు.. గుట్టలు..లోయలు దాటితే– పాలుట్ల గిరిజన గ్రామం. అడవిని ఆనుకుని ఉంటుంది. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండల కేంద్రం నుంచి అతి కష్టం మీద ప్రయాణం చేస్తే 5 గంటల సమయం పట్టింది. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి పురాతన గ్రామం ఇది. అభివృద్ధికి ఆమడ దూరం. పెన్షన్‌ తీసుకోవాలంటే మండల కేంద్రానికి 60 కిలో మీటర్లు వెళ్లాల్సిన పరిస్ధితి. ఒకపుడు– ఎన్నికలు వచ్చాయంటే హెలికాఫ్టర్‌ ద్వారా సిబ్బంది, సామగ్రిని తరలించాల్సి వచ్చేది. ఇపుడు– ఈ గిరిజన పల్లెలో గ్రామ సచివాలయం వచ్చింది. ఇంటింటా సంక్షేమానికి శ్రీకారం చుట్టింది.
 
ఉదయం 11.30 ...  గ్రామంలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, గర్భిణులను సైతం తీసుకుని 60 కి.మీ. దూరం నరకయాతన పడాలి. రెండేళ్లుగా స్థానికులు అందరు కలిసి ఓ లారీ, రెండు కమాండర్‌ జీపులు కొని కొండ దారిలోనే వ్యయ ప్రయాసల కోర్చి మండల కేంద్రానికి ప్రయాణాలు సాగిస్తున్నారు. తండాలోని నాగేశ్వరరావు నాయక్‌ ను పలకరించగా... గతంలో ఏ ప్రభుత్వ పథకాలు పొందాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇపుడు మా గ్రామాన్ని ప్రత్యేకంగా గిరిజన పంచాయతీగా ఏర్పాటు చేశారు. పాలుట్ల తండాకు  సచివాలయం వచ్చింది. అప్పటి నుంచి ప్రజల కష్టాలు తీరాయి. చుట్టుపక్కల ఉండే ఆరు చెంచు గూడేలు సైతం గ్రామ సచివాలయ సేవలను వినియోగించుకుంటున్నాయి. ప్రతి నెలా పింఛన్లను వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి అందజేస్తు్త న్నారని ఆయన వివరించారు. 

పాలుట్ల తండాతో పాటు పరిధిలో ఉన్న నెక్కంటి, పండల బయలు, గుట్టల చేను, నాతడికలు, ఆలాటం, ఇస్తకామేశ్వరి అనే చెంచుగూడేలకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వెళ్లి ఇంటింటి సర్వే చేసి సమస్యలు తెలుసుకుంటున్నారు. గతంలో 114 పింఛన్‌లు ఉండగా ప్రస్తుతం 127 మందికి పింఛన్‌లు అందిస్తున్నారు.అర్హులైన వారికి రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు సచివాలయం ద్వారా ఇస్తున్నారు.

గ్రామంలో రైతుభరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయి. త్వరలో జనతా బజార్, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయి. పాలుట్ల తండాలో 261 మంది  రైతులకు రైతు భరోసా డబ్బులు అందాయి. గ్రామంలో ఇంటర్‌నెట్‌ లేనప్పటికీ సచివాలయ సిబ్బంది రూటర్‌ల ద్వారా లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారు. జాబితాలను మండల కేంద్రానికి పంపుతున్నారు. 

ఇంటికే వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు 
పింఛన్‌ డబ్బులు ఇంటికే వస్తాయంటే నమ్మ లేదు. వలంటీర్లు ఇంటి కొచ్చి ప్రతినెలా పింఛన్‌ డబ్బులు ఇచ్చి వెళ్తుంటే కన్నకొడుకే పంపుతున్నంత ఆనందం కలుగుతోంది. 
– దేశావత్‌ భామనిభాయి   

నడవలేని నన్ను ఆదుకున్నారు
ఇంట్లో నుంచి బయటికి కూడా నడవలేని పరిస్థితి నాది. గతంలో పింఛన్‌ డబ్బుల కోసం మండల కేంద్రానికి వెళ్లలేక వదిలేసి కూర్చున్నా. అప్పట్లో నా మొర ఆలకించే నాధుడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఇంటికే వచ్చి పింఛన్‌ డబ్బులు ఇస్తున్నారు.
–మండ్లి బసవమ్మ, దివ్యాంగురాలు

ఆరోగ్యశ్రీ కార్డు అందుకున్నా
ఆపద కాలంలో అవసరం అవుతుందని గతంలో ఎన్నో సార్లు ఆరోగ్య శ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఎన్నో ఇబ్బందులు పడి మండల కేంద్రానికి తిరిగా. అయినా కార్డు మంజూరు కాలేదు.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆరోగ్య శ్రీకార్డు వలంటీరు ద్వారా అందుకున్నాను. ఇంటి వద్దకే వచ్చి మరీ కార్డు అందజేయడంతో చాలా సంతోషం వేసింది.
– నీనావత్‌ తులసీ నాయక్‌

పాలుట్ల తండా వివరాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top