‘డ్రాపవుట్స్’కు ప్రత్యేక కోర్సులు | special courses for Drapavuts | Sakshi
Sakshi News home page

‘డ్రాపవుట్స్’కు ప్రత్యేక కోర్సులు

Nov 17 2013 2:17 AM | Updated on Sep 4 2018 5:07 PM

విద్యాభ్యాసం మధ్యలో విరమించిన వారు (డ్రాపవుట్స్) తిరిగి విద్యతో పాటు వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అవకాశం కల్పిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: విద్యాభ్యాసం మధ్యలో విరమించిన వారు (డ్రాపవుట్స్) తిరిగి విద్యతో పాటు వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అవకాశం కల్పిస్తోంది. నేషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌వీఈక్యూఎఫ్) కింద కమ్యూనిటీ కాలేజీల పేరుతో డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో వొకేషనల్ కోర్సులను ప్రారంభించనున్నట్లు ఏఐసీటీఈ చైర్మన్ ఎస్.ఎస్.మంథా వెల్లడించారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో  ఈ కోర్సులను ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పారు. కమ్యూనిటీ కాలేజీల ఆవశ్యకతపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డ్రాపవుట్ అయిన వారికి 9వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఏడు దశల్లో (తొలి దశ 9వ తరగతి స్థాయి కోర్సు, రెండో దశ పదో తరగతి స్థాయి, మూడూ నాలుగు దశలు ఇంటర్మీడియట్ స్థాయి డిప్లొమా, తరువాత 5, 6, 7 దశలు డిగ్రీ స్థాయి అడ్వాన్స్‌డ్ డిప్లొమాగా) ఈ కోర్సులు ఉంటాయని వివరించారు. ఈ ఏడు దశలను పూర్తి చేస్తే డిగ్రీతో సమానమేనని, సర్టిఫికెట్లను అందజేస్తామని చెప్పారు. ఈ కోర్సుల్లో విద్యతో పాటు ఐటీ, ఆటోమొబైల్  తదితర 15 రంగాల్లో వృత్తిపరమైన శిక్షణ కూడా ఇస్తారని వెల్లడించారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు.

 

దేశవ్యాప్తంగా 360 కమ్యూనిటీ కాలేజీలను మంజూరు చేశామని, వాటిలో 12 రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. వీటి సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యారంగంలో 2.50 కోట్ల మంది విద్యార్థులు ఉంటే డ్రాపవుట్స్ కూడా అంతే సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఈ డ్రాపవుట్స్ సంఖ్య వచ్చే ఐదేళ్లలో రెట్టింపయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బిజినెస్ స్కూళ్ల జాబితాను గత ఏడాదే ప్రకటించామని, అయితే వాటిపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వానికి, మానవ వనరుల మంత్రిత్వ శాఖను సంప్రదించామని, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన ఏఐసీటీఈ అనుమతి అవసరమని గుర్తించాలని కోరామని మంథా వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement