హాక్‌.. నేరాలకు చెక్‌!

Sophisticated vehicle For Kurnool Police Department - Sakshi

పోలీసు శాఖకు మరో అత్యాధునిక వాహనం  

పాత నేరస్తులను గుర్తించడందీని ప్రత్యేకత   

కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు శాఖకు మరో అత్యాధునిక వాహనాన్ని కేటాయించింది. నేరస్తులు, ఆందోళనకారులపై నిఘా ఉంచేందుకు ఫాల్కన్‌ వాహనం తరహాలో హాక్‌ మొబైల్‌ వాహనాన్ని కేటాయించింది. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్‌ మైదానంలో వాహన పనితీరును ఎస్పీ గోపీనాథ్‌ జట్టి పరిశీలించారు. ఈ వాహన సేవలను ఉపయోగించుకుని జిల్లాలో నేరాల శాతాన్ని పూర్తిగా తగ్గించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హాక్‌ మొబైల్‌ వాహనం విశేష సేవలు అందించనున్నది. ఇరుకైన ప్రాంతాల్లో కూడా వేగంగా వెళ్లి అనుమానితులను పసిగట్టగలదు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఈ వాహనం యొక్క ప్రత్యేకత (పాత నేరస్తులను గుర్తించగలదు). అత్యాధునిక నిఘా వ్యవస్థ కల్గిన ఈ హాక్‌ మొబైల్‌ వాహనంలో 180 డిగ్రీలు, 360 డిగ్రీల అత్యాధునిక కెమెరాలు, సీసీ కెమెరాలను మానిటరింగ్‌ చేసేందుకు 4 అత్యాధునిక కంప్యూటర్లు ఉన్నాయి.

16 టెరా బైట్స్, 8 టెరా బైట్స్‌ సామర్థ్యం గల రెండు సర్వర్లను అమర్చారు. రెండు హెచ్‌డీ పీటీజడ్‌ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆందోళనకారుల కదలికలను ఫిక్స్‌డ్‌ పీటీజడ్‌ కెమెరాలు కవర్‌ చేస్తాయి. పోర్టబుల్‌ పీటీజడ్‌ కెమెరాను ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఒక డ్రోన్‌ కెమెరా, రెండు బాడీ వార్న్‌ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు వెళ్లేందుకు వీలుకాని పరిసర ప్రాంతాల్లోకి బాడీ వార్న్‌ కెమెరాలు తీసుకెళ్లి రెండు వైపుల నుంచి రికార్డు చేయవచ్చు. జాయ్‌స్టిక్‌తో కెమెరాలను కంట్రోల్‌ చేసే వెసులుబాటు ఉంది. రిమోట్‌ ఆపరేటింగ్‌ కూడా చేయవచ్చు. కమ్యూనికేషన్‌ ఉ పయోగం కోసం అత్యాధునిక అల్ట్రా ఫ్రీక్వెన్సీ మొబైల్‌ సెట్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.

దీనివల్ల అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులను గుర్తించవచ్చు. డిటెక్షన్‌ పీపుల్, యాంటినా సెట్‌లో ట్రాన్స్‌మిటర్, రిసీవర్‌ ఏర్పరిచారు. దీని నెట్‌వర్క్‌ యాంటినా రేంజ్‌ 300 మీటర్ల వరకు ఉంటుంది. ఒక జనరేటర్, యూపీఎస్, ఏపీ ఫ్రిడ్జ్, ఓవెస్, నాలుగు వైర్‌లెస్‌ కెమెరాలు, వీడియో వాల్‌ తదితర వాటిని ఇందులో ఏర్పాటు చేశారు. వీవీఐపీ బందోబస్తులు, ఉత్సవాలు, భారీ జన సమీకరణ సభలు, ధర్నాలు, ప్రదర్శనల్లో హాక్‌ మొబైల్‌ వాహనంతో ఇకపై నిఘా ఉంచనున్నారు. ధర్నాలలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఈ వాహన సేవలను ఇకపై పోలీసులు పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. ఎస్పీతో పాటు అడిషనల్‌ ఎస్పీ మాధవరెడ్డి, సీఐ నాగరాజు యాదవ్‌తో పాటు నెక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ వై.శ్రీనివాసరావు, హాక్‌ వాహన టీమ్‌ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top