వ్యవసాయంతో ‘ఉపాధి’ అనుసంధానం?

Soon the Chief Ministers Committee report on Employment Guarantee Merge - Sakshi

త్వరలో ముఖ్యమంత్రుల కమిటీ నివేదిక

విత్తనం.. మొదలు విక్రయం వరకు పథకం అమలు

వ్యతిరేకిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘాలు  

సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించే విషయమై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ ముసాయిదా నివేదికను దాదాపు సిద్ధం చేసింది.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు కేంద్రానికి సమర్పించవచ్చని తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తే వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ముఖ్యమంత్రుల కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే ఈ కమిటీ చేయబోయే సిఫారసులు ఏమిటన్నది ముందే బయటకు పొక్కడంతో  విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ ఖర్చులు తగ్గితేనే రైతు బతికి బట్టకడతాడని కొందరు రైతులు వాదిస్తుండగా కూలీల కడుపుకొట్టి భూ స్వాములకు పెడతారా? అని వ్యవసాయ కూలి సంఘాలు మండిపడుతున్నాయి.  

అసలేమిటీ కమిటీ?
వ్యవసాయ ఖర్చులు తగ్గించాలనే దానిపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు కేంద్రం ఏడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, బిహార్, యూపీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌) ముఖ్యమంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ ఇటీవల ఢిల్లీలో భేటీ అయి వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. విత్తనం మొదలుకొని పంటల ఉత్పత్తుల అమ్మకాల వరకు పథకాన్ని ఎలా వర్తింపజేయవచ్చు అనేది ప్రధానంగా చర్చించింది. సాగు ఖర్చులు తగ్గించి, నీటిని సమర్థంగా వినియోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం, గిట్టుబాటు కల్పించడం, ప్రకృతి విపత్తులతో దెబ్బతిన్న భూముల్ని తిరిగి పునరుద్ధరించడం వంటి అంశాలను చర్చించినా ప్రధానంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎలా అనుసంధానం చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది.

దేశంలో అమలవుతున్న అతిపెద్ద సంక్షేమ పథకమైన ఉపాధి హామీకి 2017–18లో కేంద్రం రూ.55 వేల కోట్లను కేటాయించి నైపుణ్యం లేని కూలి కింద సంతకం చేసి గుర్తింపు కార్డు పొందిన ప్రతి గ్రామీణ కార్మికునికి ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి, అనువైన ఆస్తుల సృష్టి అనే ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనకు అనుగుణంగా వ్యవసాయ రంగ అవసరాలను తీర్చడం ఎలా? అనే విషయాన్ని ముఖ్యమంత్రుల కమిటీ పరిగణలోకి తీసుకుంది. కనీస వేతనాల కన్నా ఉపాధి హామీ కూలి ఎక్కువగా ఉన్నందున వ్యవసాయంతో అనుసంధానం చేస్తే ఉపయోగంగా ఉంటుందని భావిస్తోంది.

భూస్వాముల ఉపాధిగా మారుస్తారా?
వ్యవసాయంలో ఉపాధి హామీ నిధులు ఖర్చుకు అవకాశం ఇవ్వడాన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు  వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే 29 రకాల పనులను వ్యవసాయంతో అనుసంధానం చేశారని, మరో 12 రకాల పనులను కొత్తగా ఆ జాబితాలో చేర్చాలని చూస్తున్నారని, అదే జరిగితే ఇది భూస్వాముల ఉపాధి హామీగా మారుతుందని వాదిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇందుకు సుముఖత వ్యక్తం చేయడాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సుబ్బారావు ఖండించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించిన స్ఫూర్తినే దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సి వస్తే వంద రోజుల పని చట్టాన్ని 360 రోజుల పనికి పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top