దివిసీమకు సర్పదోషం | Snakebite Deaths In Avanigadda Amaravati | Sakshi
Sakshi News home page

దివిసీమకు సర్పదోషం

Aug 23 2018 1:33 PM | Updated on Oct 22 2018 2:22 PM

Snakebite Deaths In Avanigadda Amaravati - Sakshi

అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే 248 పాముకాటు కేసులు నమోదయ్యాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలు పాము కాట్లతో వణికిపోతున్నారు. వందలాది మంది పాముకాటు బాధితులను ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు అధికంగా పడుతుండటం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు 70 పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో అధిక భాగం నారు వేసే కూలీలు గురికావడం గమనార్హం. గన్నవరం ప్రాంతంలోనూ గత వారం రోజుల్లో పాము కాటుతో ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన దొడ్ల శ్యాంసన్‌ (18) ఆదివారం రాత్రి గ్రామంలో నడుచుకుంటూ ఇంటికి చేరుతున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానకి అపస్మారక స్థితికి చేరుకొని మృత్యువాత పడ్డాడు. అలానే ఉంగుటూరు మండలం తేలప్రోలు యాదవులపేటకు చెందిన పూర్ణచంద్రరావు గడ్డి వామిలో పాము కాటుకు గురయ్యాడు.  ఆ విషయాన్ని గుర్తించి వెంటనే వైద్యం చేయించుకోకపోవడంతో వారం రోజుల చిక్సిత అనంతరం సోమవారం మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే 248 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 పాయిజన్‌ కేసులు, 101 నాన్‌ పాయిజన్‌ కేసులుగా నమోదయ్యాయి. ఇవి కాక స్థానికంగా ఉన్న ఏడు పీహెచ్‌సీలలోనూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

పెరిగిన పాముల సంతతి....
కొన్ని సంవత్సరాలుగా దివిసీమలో పాముల సంతతి అమాంతం పెరిగిపోయింది. రైతులు వరిపొలాల్లో గుళికలను వాడకపోవడమే పాములు పెరగడానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. పాముల సంతతి 2009లో వచ్చిన వరదల తర్వాత ఈ ప్రాంతంలో అధికమయ్యిందని, అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు పాములు పట్టి అడవుల్లో వదిలే స్నేక్‌ లవర్స్‌ కూడా ఈ ఏరియాలో అందుబాటులో లేకపోవడం మరో కారణం. పాముకాటు బాధితులు గ్రామాల్లోని నాటువైద్యం నమ్ముకోవడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాటుకు గురైన వెంటనే దగ్గర్లోని వైద్యశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు కానీ నిర్లక్ష్యంగా చేయడం  వల్ల మృత్యువాత పడుతున్నారు. ఆధునిక యుగంలోనూ వైద్యుడిని సంప్రదించుకుండా ఇంకా చాలా గ్రామాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రథమ చికిత్స తప్పనిసరి...
పాము కాటు గురైన వ్యక్తికి పాము విషం కన్నా భయమే ఎక్కువ ప్రమాదం. బాధితులకు పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. కాటు వేసిన చోటుకు పై భాగంలో వెంటనే తాడుతో మిగతా శరీరానికి రక్త ప్రసరణ జరగకుండా బిగించి కట్టివేయాలి. కాటు వేసిన భాగంలో పదునైన బ్లేడుతో గాయం చేసి రక్తం కారనివ్వాలి. వీలైనంత వరకు కాటుకు గురైన వ్యక్తిని నడిపించకూడదు. (చదవండి: సమయస్ఫూర్తితోనే ప్రాణాలకు రక్షణ)

24 గంటలూఅందుబాటులో వైద్యం....
వర్షాకాలంలో పాముల సంచారం అధికంగా ఉంటుంది. తడి ప్రాంతం నుంచి పొడి ప్రాంతానికి పాములు చేరుతుంటాయి. ఇటువంటి సమయాల్లో ప్రజలు జాగ్రత్త వహిస్తే కాట్ల నుంచి బయటపడవచ్చు. అవనిగడ్డ ప్రాంతంలోని అన్ని పీహెచ్‌సీలలో పాము కాటుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో 136 యాంటీ స్నేక్‌ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్పప్పటికీ ఇప్పటికి కొంతమంది నాటువైద్యం నమ్మకుంటున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
– డాక్టర్‌ కృష్ణదొర, సూపరింటెండెంట్, అవనిగడ్డ ఏరియా వైద్యశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement