సామర్థ్యానికి పరీక్ష

Slas Exams For Tenth Class Students YSR Kadapa - Sakshi

26 నుంచి 4,6,9 తరగతుల విద్యార్థులకు శ్లాస్‌ పరీక్షలు

జిల్లాలో 48 మండలాల్లో 238 యాజమాన్య పాఠశాలలు ఎంపిక

5,920 మంది పిల్లలపై ప్రయోగం

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు జిల్లాలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో స్టూడెంట్‌ లెవెల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(శ్లాస్‌) పరీక్షను నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్షలను జిల్లా కామన్‌ ఎగ్జామ్‌బోర్డు(డీసీఈబీ) పర్యవేక్షణలో మండల రీసోర్స పర్సన్లు పరీక్షలను నిర్వహించనున్నారు. ఎస్‌సీఈఆర్టీ (రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోదన సంస్థ) సూచనల మేరకు రాష్ట్రస్థాయిలో ఉన్న స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్ష నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

238 పాఠశాలల ఎంపిక
శ్లాస్‌ పరీక్ష నిర్వహణకు జిల్లాలోని 48 మండలాల్లోని 238 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 9వ తరగతికి 34 స్కూళ్లకు 930 మంది విద్యార్థులు, 6వ తరగతికి సంబంధించి 39 స్కూళ్లకు 1030 మంది, 4వ తరగతికి సంబంధించి 17 స్కూళ్లకుగాను 480 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి 9వ తరగతి 26 స్కూళ్లకు 710 మంది, 6వ తరగతి సంబంధించి 26 స్కూళ్లకు 690 మంది, 4వ తరగతికి సంబంధించి 13 స్కూళ్లకు 280 మంది విద్యార్థులు ఉన్నారు. తెలుగు మీడియంకు సంబంధించి 9వ తరగతిలో 19 స్కూళ్లకు 520 మంది, 6వ తరగతిలో 31 స్కూళ్లకు 720 మంది, 4వ తరగతిలో 33 స్కూళ్లకు 560మంది ఉన్నారు. మొత్తం 5920 మంది విద్యార్థులపై ప్రయోగం చేయనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 122 మంది సీఆర్‌పీలను ఎంపిక చేశారు.

పరీక్ష నిర్వహణ ఇలా
శ్లాస్‌ పరీక్షలు 4,6,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించనున్నారు. ఇందులో 26న 9వ తరగతి విద్యార్థులకు, 27న 6వ తరగతి విద్యార్థులకు, 28న నాల్గో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించనున్నారు. ఇందులో ఉదయం తెలుగు లేదా ఇంగ్లిస్, మధ్యాహ్నం గణిత సబ్జెక్టు పరీక్షను నిర్వహిస్తారు.

భవిషత్తు ప్రణాళిక కోసం
గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్‌ ఎరియాల్లో ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకు శాస్ల పరీక్ష నిర్వహిస్తున్నందున ఏ ప్రాంత విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారనేది తెలిసిపోతుంది. పరీక్ష అనంతరం నిపుణుల సూచనలతో ఎన్‌సీఈఆర్టీ వారికి నివేదిక అందజేయనున్నారు. పాఠ్యాంశాల్లో మార్పులు, చేర్పులు చేయాలా? లేక మరేదైనా కొత్త విధానాన్ని అమలు చేయాలా అనేదానిపై ఎస్‌సీఈఆర్టీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top