సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి 

Six years old student dead in private school - Sakshi

తోటి విద్యార్థులు నెట్టడంతో ప్రమాదం 

పాణ్యం ప్రైవేట్‌ పాఠశాలలో ఘటన 

పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యంలోని విజయానికేతన్‌ ప్రైవేట్‌ పాఠశాలలో బుధవారం సాంబారు పాత్రలో పడి పురుషోత్తంరెడ్డి (6) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి, కల్పన దంపతులకు కుమారుడు పురుషోత్తంరెడ్డితో పాటు కుమార్తె ఉంది. కల్పన రెండేళ్ల క్రితమే మృతి చెందడంతో పురుషోత్తంరెడ్డిని తండ్రి విజయానికేతన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో యూకేజీలో చేర్పించాడు.

రోజూ లాగానే బుధవారం మధ్యాహ్నం భోజనానికి క్యూలైన్‌లో నుంచున్న విద్యార్థులు వెనుక నుంచి నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తంరెడ్డి పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఆయా పీరమ్మ వెంటనే అతన్ని బయటకు తీయగా..పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే పురుషొత్తంరెడ్డి చర్మంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విద్యార్థి తండ్రికి సమాచారం అందించిన యాజమాన్యం పాఠశాలకు తాళాలు వేసి కర్నూలు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ పురుషోత్తంరెడ్డి చనిపోయాడు. పాణ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

విద్యార్థి సంఘం నిరసన..  
పాఠశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన విజయానికేతన్‌  పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని   విద్యార్థి సంఘం నేతలు పలువురు బుధవారం రాత్రి పాఠశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతి చెందినా పట్టించుకోకుండా..కరస్పాండెంట్,  డైరెక్టర్లు సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసుకున్నారని  ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు ఆందోళన విరమించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top