పసలేని శివాజీ కుట్ర పురాణం

Shivaji Making UnTruth Comments On MEIL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే  గరుడ పురాణం శివాజీ తాజాగా మరో కుట్రకు తెరతీశారు. అభూత కల్పనలు, అసత్య ప్రచారం చేసి అవేమి నిజం కాక విశ్వసనీయతను కోల్పోయిన అవకాశాలు లేని శివాజీ తాజాగా మేఘా ఇంజనీరింగ్‌పై విషం కక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన ‘మేఘా’ పై బురద జల్లేందుకు కొత్తనాటకం ప్రారంభించాడు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పటివరకు శివాజీ చెప్పిన అనేక కథలు కేవలం పిట్ట కథలు మాత్రమే అని తేలిపోయింది.
 
ఫలించని గరుడ, ద్రావిడ:
ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వచ్చిన తర్వాత నుంచి శివాజీ జ్యోతిషం చెప్పడం మొదలుపెట్టాడు. దానికి పచ్చ మీడియా విపరీతంగా ప్రచారం కల్పించింది. తొలుత బీజేపీ ఆపరేషన్ గరుడ, ద్రావిడ  పేరుతో నాటకం ప్రారంభించాడు. ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబు ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం అస్థిరపరచాలని ప్రణాళిక వేసిందని, దక్షిణ భారత దేశంలో పాగా వేయడానికి  ఆపరేషన్ ద్రావిడ కు రూపకల్పన చేసిందని ఇందుకు ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పుకొచ్చాడు. దీనికి పచ్చ మీడియా బాగా ప్రచారం కల్పించింది. అయితే ఈ ప్రచారాలు చంద్రబాబుపై సానుభూతిని పెంచుతాయని ఎల్లో బ్యాచ్‌ భావించినా అలాంటివి ఏమి జరగకపోగా, అవి వికటించి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు.
 
అల్లర్ల కట్టు కథలు:
ఆ తర్వాత రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిపై దాడికి ప్రణాళిక వేస్తున్నారని, తద్వారా  అల్లర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచెయ్యాలని కుట్ర చేస్తున్నారని శివాజీ ఆరోపించాడు. తమకు తాముగా దాడి చేయించుకొని తద్వారా ప్రభుత్వానికి అప్రదిష్టపాలు చెయ్యాలని ఉద్దేశం అని శివాజీ ఆరోపించాడు. జగన్ మోహన్ రెడ్డిపై విమానాశ్రయంలో దాడి జరిగింది, కానీ ఎక్కడ అల్లర్లు జరగలేదు. అదేవిధంగా సానుభూతికోసం వారే ఆలా చేయించుకున్నారు అనడానికి ఆధారాలు లభించలేదు.
 
నకిలీ పత్రాల సృష్టి:
టీవీ 9 యాజమాన్యంలో తనకు షేర్లు ఉన్నాయనే నకిలీ పత్రాలను సృష్టించి సైబర్ క్రైమ్ పోలీసులకు సాక్ష్యాలతో సహా దొరికి అభాసుపాలయ్యాడు  శివాజీ. టీవీ 9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని రవి ప్రకాశ్ తో కలిసి కుట్రపన్నారు. నేషనల్ లా ట్రిబునల్లో కేసు వేసేందుకు గాను పాత తేదీల్లో పత్రాలను సృష్టించి, శివాజీకి షేర్ టివి 9లో షేర్లు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసారు.  

మేఘాపై తాజా కుట్ర:
ఇలా అనేక అక్రమాలకు పాల్పడి, అవాస్తవాలు ప్రచారం చేస్తున్న శివాజీ తాజాగా మేఘా ఇంజనీరింగ్ లక్ష్యంగా ఆరోపణలకు దిగాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాటి చంద్రబాబు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ అందులో భాగంగా పోవరం కాంట్రాక్టు రద్దుచేసి టెండర్లు పిలువగా మేఘా ప్రభుత్వానికి రూ. 720 కోట్లు మిగిలే విధంగా బిడ్డు దాఖలు చేసింది. ఈ పరిణామం చంద్రబాబుకు మింగుడు పడలేదు. క్విడ్ ప్రోకో ఆరోపణలకు దిగారు. ఎలక్ట్రిక్ బస్సులను ఇందులోకి లాగారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి పోలవరం టెండర్లను రద్దు చేసిందని, తక్కువకు చెయ్యడానికి ముందుకు వచ్చిన మేఘ ఇంజనీరింగ్ కు బస్సులను కొనుగోలు చెయ్యడం ద్వారా నష్టాన్ని భర్తీ చేస్తారని ఒక కొత్త ప్రచారానికి తెర తీశారు.

కుట్రల శివాజీ మరో కుతంత్రానికి తాజా పురాణం చెబుతున్నారు. ఈ విధమైన కథనాలు ఆఖరుకు పచ్చమీడియా కూడా నమ్మే పరిస్థితిలేదు. దాంతో ఆయన సినిమా పద్థతిలో వీడియో క్లిప్ ను  వైరల్ చేసే పద్థతి ఎంచుకున్నారు. అటు ఏపీ ప్రభుత్వాన్నీ రాజకీయంగా దెబ్బతీయటం అందులో భాగంగా మేఘా మీద బురద చల్లడం తెలుగుదేశం స్క్రిఫ్ట్‌లో  భాగంగానే కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణం కానుంది. ఎంఈఐఎల్ బ్లాక్ మెయిలింగ్ వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇవ్వాలన్నదే శివాజీ లక్ష్యం. ఇది అతడు నటిస్తున్న టీడీపీ రచించిన రాజకీయ కుట్రగా ఉందనే అనుమానాలకు బలం  చేకూరుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top