అందరూ ఉన్నా.. అనాథగా కాటికి

Shiva Shankariah Died With Illness in Anantapur - Sakshi

ఆరోగ్యం క్షిణించి శివశంకరయ్య మృతి  

అనంతపురం, హిందూపురం: వైఎస్సార్‌ జిల్లా చెనిక్కాయపల్లి రామాపురం చిట్టూరు వాసి శివశంకరయ్య (80) ఆరోగ్యం క్షీణించి కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లేకపోవడంతో అనాథగా కాటికి చేరాడు. శివశంకరయ్య కుటుంబాన్ని పోషించే సమయంలో వ్యసనాలకు లోనై ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. భార్యా పిల్లలు ఏమయ్యారో కూడా పట్టించుకోలేదు. వృద్ధాప్యం మీదపడిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చక్కెరవ్యాధితో బాధపడుతున్న ఇతడు కాలికి గాంగ్రిన్‌ అవడంతో నడవలేని స్థితిలో హిందూపురం ఆస్పత్రిలో చేరాడు. ఇతనికంటూ ఎవరూ లేకపోవడంతో సపర్యలు చేసేవారు కూడా కరువయ్యారు. ఇతని దీనస్థితిపై ఈ నెల 2 నుంచి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

కుటుంబంతో అతడిని కలిపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తమకు చేసిన ద్రోహాన్ని తలచుకుని కుటుంబ సభ్యులు శివశంకరయ్యను చూడటానికి కూడా ఇష్టపడలేదు. దీంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్‌ ఫరూక్‌ తదితరులు శివశంకరయ్యకు అండగా నిలవగా.. వైద్యులు మానవత్వంతో స్పందించి ఆపరేషన్‌ చేశారు. తర్వాత సేవామందిరంలోని వృద్ధాశ్రమానికి చేర్చారు. కుటుంబాన్ని దూరం చేసుకుని తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని, అవసాన దశలో దిక్కులేని వాడినయ్యానని మనోవేదన చెందిన శివశంకరయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో సీఐ బాలమదిలేటి, ఎస్‌ఐ కరీం, ఏఎస్‌ఐ వెంకటరాముడు,  స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉమర్‌ఫరూక్, షేక్‌షబ్బీర్, ఉమర్, దండోరా నాయకులు సతీష్‌కుమార్, మండీ మోట్‌ అసోసియేషన్‌ హాజీ నూరుల్లా, ఖురైష్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సాదిక్‌ ఖురేషీ, ఉసామాఖాన్, ఉమర్‌ పరిగిరోడ్డులోని శ్మశానవాటిలో శివశంకరయ్య అంత్యక్రియలు నిర్వహించారు. 
నాకు నాన్న అవసరం లేదు...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top