అధికార పార్టీ కక్ష సాధింపు | Shilpa Chakrapani Reddy remove Gun Men | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ కక్ష సాధింపు

Nov 20 2017 7:01 AM | Updated on Aug 21 2018 3:16 PM

Shilpa Chakrapani Reddy remove Gun Men - Sakshi

అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్‌ చేసుకొని మరీ వేధిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గంలో కీలక నేతలకు గన్‌మెన్లను తొలగించడం వీరి వేధింపులకు పరాకాష్ట. వీరంతా తెలుగుదేశం పార్టీలో ఆరునెలల క్రితం వరకు ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన అనంతరమే గన్‌మెన్‌లను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

నంద్యాలటౌన్‌: వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి,  మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచనలకు గన్‌మెన్‌లను తొలగిస్తూ జిల్లా పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఒకసారి శ్రీశైలం నియోజకవర్గం నుంచి  అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక అనంతరం సూరజ్‌ హోటల్‌ వద్ద  చక్రపాణిరెడ్డిపై టీడీపీ నాయకుడు అభిరుచి మధు హత్యాయత్నం చేయడానికి కొడవలి పట్టుకొని హల్‌చల్‌ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అభిరుచి మధుపై కేసు నమోదు అయినా ఇంత వరకు అతన్ని అరెస్ట్‌ చేయలేదు. పైగా గన్‌మెన్లను కూడా కొనసాగిస్తున్నారు. అయితే రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన చక్రపాణిరెడ్డికి 2+2 గన్‌మెన్లు తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  వైఎస్సార్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.

 శిల్పామోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి 2+2 గన్‌మెన్లతో భద్రతా సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారిని తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీపీ నాగిరెడ్డి..జిల్లా పరిషత్‌ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1+1 గన్‌మెన్లు ఉండగా వారిని తొలగించారు. అలాగే నంద్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచనకూ పోలీస్‌ భద్రత తీసివేశారు. దేశం సులోచన సోదరుడు కేదార్‌నాథరెడ్డి గతంలో ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, పీపీనాగిరెడ్డి, దేశం సులోచనలకు రాజకీయ పరంగా ప్రత్యర్థులు ఉన్నారు. ఎప్పటి నుండో ఉన్న గన్‌మెన్లను తొలగించడం రాజకీయ కక్ష సాధింపేనని  చర్చించుకుంటున్నారు. గతంలో  చెరుకుపాడు నారాయణరెడ్డికి కూడా వైఎస్సార్‌సీలో చేరాక గన్‌మెన్లను తొలగించారు. భద్రతను కొనసాగించాలని పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. భద్రత లేని కారణంగా ప్రత్యర్థులు దారి కాచి  నారాయణరెడ్డిని సులభంగా హతమార్చగలిగారు. ఇదే విధంగా ప్రస్తుతం భద్రతా సిబ్బందిని తొలగించిన ఈ నలుగురు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు హాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.  

ఇబ్బందులు పెట్టేందుకే గన్‌మెన్లను తొలగించారు: 
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరినందుకే గన్‌మెన్లను తొలగించారు. పార్టీ మారితే కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచి పరిణామం కాదు.  టీడీపీ బెదిరింపులకు మేం భయపడం. జిల్లా ఎస్పీకి, డీఐజీకి భద్రత కొనసాగించాలని విన్నవిస్తాం. లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం.  
శిల్పాచక్రపాణిరెడ్డి,  వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement