హింసకు దిగితే సీమాంధ్రులకే నష్టం | seemandhra employees will Loss, if start agitation against telangana: c.vithal | Sakshi
Sakshi News home page

హింసకు దిగితే సీమాంధ్రులకే నష్టం

Nov 25 2013 1:21 AM | Updated on Sep 2 2017 12:57 AM

అనవసరంగా తెలంగాణకు అడ్డుపడుతూ రెచ్చగొడితే సీమాంధ్ర ఉద్యోగులకే నష్టమని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్ హెచ్చరించారు.

సాక్షి, న్యూస్‌లైన్: అనవసరంగా తెలంగాణకు అడ్డుపడుతూ రెచ్చగొడితే సీమాంధ్ర ఉద్యోగులకే నష్టమని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్ హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగితే సీమాంధ్ర ఉద్యమం హింసారూపం దాల్చుతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించడాన్ని ఆయన  తీవ్రంగా తప్పుపట్టారు. హింస ఎవరిమీద చేస్తారు, ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. హింసకు దిగితే నష్టపోయేది సీమాంధ్ర ఉద్యోగులేనని, తెలంగాణకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ఆదివారం ఎల్‌బీ స్టేడియంలోని ఫతేమైదాన్‌లో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్రకార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో సి.విఠల్ మాట్లాడుతూ హైదరాబాద్‌పై గవర్నర్‌పాలన, త్రిసభ్యపాలన సమ్మతించబోమని  తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది ప్రజాపాలనే కానీ ఇతరుల పాలన కాదన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఒక శాతం కూడా లేదన్నారు. అదే తెలంగాణలో మాత్రం సీమాంధ్ర ఉద్యోగులు పెద్దసంఖ్యలో ఉన్న సంగతి మరిచిపోరాదన్నారు. అందుకని రెచ్చగొట్టి హింసకు పాల్పడితే సీమాంధ్ర ఉద్యోగులే నష్టపోతారని హెచ్చరిం చారు.
 
  ఇలాంటి ప్రకటనలు చేస్తున్న అశోక్‌బాబుపైనా, ఇతర సీమాంధ్ర ఉద్యోగసంఘాల నేతలపైనా కేసులెందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులపై దేశద్రోహ కేసులు పెట్టిన ప్రభుత్వం, పోలీసులు ప్రస్తుతం మౌనంగా ఎందుకున్నారని ఆయన నిలదీశారు. అంతేకాక సమ్మెచేసిన తెలంగాణ ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్స్‌గా ఇస్తే, సీమాంధ్ర ఉద్యోగులకు మాత్రం రెండు నెలల జీతం అడ్వాన్స్‌గా ఇవ్వడం వివక్ష కాదా అని నిలదీశారు. అసెంబ్లీ ప్రొరోగ్‌ను అనుమతించకూడదని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. భద్రాచలం, మునగాల, శ్రీశైలం ఎడమకాల్వలు తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు అనుమతించబోమన్నారు. ఆయా ప్రాంతాలతో కూడిన 10 జిల్లాల తెలంగాణాను మాత్రమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి తరహాలో మార్చాలన్న డిమాండ్‌ను తీవ్రంగా ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement