టీడీపీ మైనార్టీ నాయకుడు బాంబే ఆరీఫ్‌పై శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు శనివారం మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు.
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: టీడీపీ మైనార్టీ నాయకుడు బాంబే ఆరీఫ్‌పై శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు శనివారం మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. మెదక్ డీఎస్పీ గోద్రూ, తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డిల నేతృత్వంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే మెదక్ పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన చౌరస్తాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు నిర్వహించారు. ఆరీఫ్‌పై దాడికి నిరసనగా శనివారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ కొందరు వ్యాపారులు మాత్రమే బంద్‌లో పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని ముస్లిం మైనార్టీ యువకులు నిరసన ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడిచేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు. అతన్ని విచారించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూ తగాదాలే ఆరీఫ్‌పై దాడికి కారణమని వెల్లడించారు. గతంలోనే ఇరువర్గాలపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైన ఉపేక్షించబోమని హెచ్చరించారు. సీఐలు విజయ్‌కుమార్, రామకృష్ణ, గంగాధర్, నందీశ్వర్‌రెడ్డిలతోపాటు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు గస్తీలో పాల్గొన్నారు.