కార్యదర్శుల పోస్టుల భర్తీపై నీలినీడలు | Secretaries of enlistment nilinidalu posts | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల పోస్టుల భర్తీపై నీలినీడలు

Nov 22 2013 3:02 AM | Updated on Aug 31 2018 8:24 PM

జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేవలం మార్కులు...

=వ్యక్తిగత స్టేలపై నిర్ణయం తీసుకోని అధికారులు
 =మొత్తం 15,461 దరఖాస్తులు
 =మార్గదర్శకాల కోసం త్వరలో పీఆర్ కమిషనర్‌కు లేఖ
 =అధికారులకు తలబొప్పి కట్టిస్తున్న నియామక ప్రక్రియ
 =సకాలంలో నియామకాలు పూర్తయ్యేనా?

 
 జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేవలం మార్కులు ఆధారంగా ఇంటర్వ్యూ కూడా లేకుండా నేరుగా నియామక ప్రక్రియ చేపట్టనుండడంతో ఈ సమస్య తలెత్తింది. వేల మంది నిరుద్యోగులను వడపోసి వందల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయడం జిల్లా అధికారులకు సవాలుగా మారింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 260 పోస్టులకు 15,461 దరఖాస్తులు వచ్చాయి. 22 పంచాయతీల కాంట్రాక్టు కార్యదర్శులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో నియామక ప్రక్రియను ఆపాలా వద్దా..?అన్న సందేహంలో అధికారులు ఉన్నారు.
 
సాక్షి, చిత్తూరు: పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి భారీగా వచ్చిన దరఖాస్తులను ఏ రీతిలో వడపోయాలి, ఇన్ సర్వీసు కాంట్రాక్టు కార్యదర్శులకు కేటాయించిన పోస్టులు పోను మిగిలిన ఖా ళీలను ఎలా భర్తీ చేయూలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం డీఎస్సీ(జిల్లా సెలక్షన్ కమిటీ) చైర్మన్‌గా కలెక్టర్ ఈ నియామక ప్రక్రియ చేపట్టాలని జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఇప్పుడు సమస్య అంతా జిల్లా పంచాయతీ అధికారుల మెడకు చుట్టుకుంది. నియామక ప్రక్రియ తాము పనిచేస్తున్న పోస్టుకు వర్తింప చేయరాదంటూ 22 పంచాయతీల కాంట్రాక్టు కార్యదర్శులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టుల వరకే నియామక ప్రక్రియ ఆపేయాలా లేదా మొత్తం 260 పోస్టుల నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలా అన్న సందేహంలో అధికారులు ఉన్నారు. కలెక్టర్‌తో చర్చించి, ఆయన ఆదేశాల మేరకు త్వరలో పంచాయతీరాజ్ కమిషనర్‌ను వివరణ కోరుతూ లేఖ రాయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
 
అంతా అయోమయం


డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీల్లో కేవలం డిగ్రీలో అత్యధిక మార్కులు ఎవరికి వచ్చుంటే వారినే ఎంపిక చేయాలని జీవోలో సూచించారు. ఉదాహరణకు ఒక పోస్టుకు 95 శాతం మార్కులు వచ్చిన వారు 15 మంది ఉంటే వీరిలో 14 మందిని ఏ ప్రతిపాదికన పక్కన పెట్టి ఆ పోస్టును భర్తీ చేయాలనేది ఇప్పుడు అధికారుల ముందున్న సమస్య. కేవలం మార్కులు ఒక్కటే ప్రతిపాదిక కావడంతో సమాన మార్కులు, ఒకే జన్మదినం ఉన్న అభ్యర్థులు పోటీపడినప్పుడు ఇలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనిపై ఎలా చేయాలనేది మార్గదర్శకాలు లేవు. అలాగని లాటరీ పద్ధతిపై ఎంపిక చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఇప్పుడు ఈ దరఖాస్తులను మెరిట్ వారీగా వడపోసి ఒక కొలిక్కి తేవడమే పెద్ద సమస్యగా ఉంది.
 
నియామక కమిటీ

ఖాళీలను భర్తీ చేసేందుకు కలెక్టర్ కే.రాంగోపాల్ ప్రత్యేక కమిటీని నియమించారు. అదనపు జాయింట్ కలెక్టర్, డీఆర్వో, డీఈవో, జెడ్పీ సీఈవో, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరు నియామక ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారితో కలిసి పర్యవేక్షిస్తారు. ఇప్పటివరకు 4వేల దరఖాస్తులను కంప్యూటరీకరణ పూర్తి చేశారు.

ఇంకా 11వేల దరఖాస్తులు కంప్యూటరీకరణ పూర్తి చేయాల్సి ఉంది. వీటన్నింటినీ కంప్యూటరీకరించిన తరువాత, మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్ పరిశీలన పూర్తయిన తరువాత, సర్టిఫికెట్లు ఒరిజినలా కాదా అన్న పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు పంపుతారు. ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్ రెండో వారం లోపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాకపోవడంతో నియామక ప్రక్రియ మరింత జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

 స్టే పై నిర్ణయం లేదు

 జిల్లాలో పనిచేస్తున్న ఇన్ సర్వీసు పంచాయతీ కార్యదర్శులు తమనే కొనసాగించాలని, కొత్త నియామకం చేపట్టరాదని వ్యక్తిగతంగా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. స్టే ఉత్తర్వులు 22 మందివి మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులకు అందాయి. అనధికారికంగా మరో 80 మంది స్టే తెచ్చుకున్నట్లు ప్రచారం సాగుతున్నా ఆ ఉత్తర్వులు ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో స్టేలు తెచ్చుకున్నవారి పోస్టులకు మాత్రమే నియామక ప్రక్రియ ఆపాలా లేదా మొత్తం పోస్టులకా..? అనేది అధికారులు తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement