
డిమాండ్–సరఫరా మధ్య 51 శాతం అంతరం
రూ. 8–45 లక్షల పైగా స్థాయిలో ఆకర్షణీయమైన వేతనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 4.16 లక్షలకు చేరింది. అయితే నిపుణులు లభిస్తున్నప్పటికీ, డిమాండ్–సరఫరా మధఅయ ఏకంగా 51 శాతం అంతరం ఉంటోంది. భవిష్యత్ అవసరాలకు సన్నద్ధతను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో వివరించింది. దీని ప్రకారం ఏఐ నిపుణుల నియామకాలు 2017 నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి.
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏఐ, డేటా నిపుణులకు డిమాండ్ దాదాపు 45 శాతం పెరిగినట్లు క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. జెన్‌ఏఐ ఇంజినీరింగ్‌లో పది ఉద్యోగావకాశాలు ఉంటే అన్ని అర్హతలు కలిగిన నిపుణుడు ఒక్కరే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏఐ విప్లవానికి సార్థ్యం వహించే సామర్థ్యాలు భారత్‌కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీన్ని అందిపుచ్చుకోవాలంటే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విధానకర్తలు ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఆకర్షణీయ వేతనాలు..
ఎంట్రీ లెవెల్ నిపుణులకు వార్షికంగా రూ. 8–12 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. ఇక ఎన్‌ఎల్‌పీ, జెన్‌ఏఐలో 5–8 ఏళ్ల అనుభవమున్న వారికి రూ. 25–35 లక్షల వరకు జీతభత్యాలు ఉంటున్నాయి. అటు ప్రోడక్ట్ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సీనియర్ ప్రొఫెషనల్స్ రూ. 45 లక్షల పైగా అందుకుంటున్నారు.
→ ఏఐ నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం ముందు వరుసలో ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ఈ రంగం వాటా 24 శాతంగా ఉంటోంది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ సరీ్వసులు, హెల్త్‌కేర్ ఉన్నాయి.
→ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులకు కూడా హైరింగ్ అవకాశాలు బాగుంటున్నాయి.
→ నైపుణ్యాలపరంగా చూస్తే పైథాన్ ల్యాంగ్వేజ్ ఆధి పత్యం కొనసాగుతోంది. అలాగే టెన్సర్‌ఫ్లో, పై టార్చ్, కేరాస్‌లాంటి ఫ్రేమ్‌వర్క్‌లకు ప్రాధా న్యం ఉంటోంది. ఎన్‌ఎల్‌పీ, కంప్యూటర్ విజన్, జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ), ఎంఎల్‌ఆప్స్ నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి.
→ జెన్‌ఏఐపరమైన నియామకా>ల్లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్రోల పరిధిని దాటి ఏఐ టాలెంట్ హబ్‌లు ఎదుగుతున్నాయనడానికి నిదర్శనంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఇప్పుడు 14–16 శాతంగా ఉంది. వీటిలోనూ కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్ నగరాల వాటా 70 శాతంగా ఉంది.
→ జీసీసీల నుంచి జెన్‌ఏఐకి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ హైరింగ్‌లో జీసీసీల వాటా23 శాతంగా ఉంది.
→ దేశీయంగా ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. విద్యారంగం, పరిశ్రమ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి పని చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించే ప్రోగ్రాంలను రూపొందించాలి.