
నిరసనకారులపై ఎఫ్‌ఐఆర్ కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టిన అభ్యర్థులపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించిన 10 మందికి ఊరటనిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వద్ద ఆందోళనకు దిగినందుకు బంజారాహిల్స్ పోలీసులు 2023 ఫిబ్రవరి 3న 16 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన కొంగరి మహేశ్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఐసీసీసీ భవనం సమీపంలో 16 మంది చట్టవిరుద్ధంగా సమావేశమై అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. రోడ్డుపై నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను అడ్డుకున్నారన్నారు. అందువల్ల దర్యాప్తును కొనసాగించేలా పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌ఫుట్ విభాగాల్లో అప్పటి వరకు ఉన్న కొలతలను మార్చి, పెంచారని ఆరోపిస్తూ శాంతియుతంగా అభ్యర్థులు నిరసనకు దిగారన్నారు.
వారు చట్ట ఉల్లంఘనకు పాల్పడలేదని.. పోలీసులు తప్ప స్వతంత్రులెవరూ సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ 10 మంది పిటిషనర్లపై కేసును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే పిటిషనర్లకు మాత్రమే ఈ ఊరట లభిస్తుందని.. మిగతా వారిపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.