ఇది పాఠశాలా లేక ఫంక్షన్‌హాలా..? | School Using As Function Hall By TDP Leaders In Visakapatnam | Sakshi
Sakshi News home page

ఇది పాఠశాలా లేక ఫంక్షన్‌హాలా..?

Jun 18 2019 10:16 AM | Updated on Jun 21 2019 12:11 PM

School Using As Function Hall By TDP Leaders In Visakapatnam - Sakshi

పాఠశాల ఆవరణాన్ని షామియానాలతో  నింపడంపై విద్యార్థుల నిరసన

సాక్షి, ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలలో పరిస్థితి మారలేదు. పాఠశాల ఆవరణలో టీడీపీ నాయకులు ఫంక్షన్లు నిర్వహిస్తూనే ఉన్నా రు. పాఠశాల జరుగుతున్న రోజుల్లోనే ఏకంగా ఇక్కడ ఫంక్షన్లు పెడుతున్నారు. అంతేకాదు అడుగుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులపై చిందులేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో వందల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో తరచూ వివాహ, ఇతర కార్యక్రమాల పెట్టడం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పెద్ద ఎత్తున వేస్తున్న షామియానాలు, వంట ఏర్పాట్లు, సౌండ్‌ సిస్టం కారణంగా పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు కూడా పాఠాలు చెప్పలేకపోతున్నారు. ఆడపిల్లలు కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగు దొడ్డికి వేళ్లే అవకాశం ఉండటం లేదు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. టీడీపీ నాయకులు పాఠశాల ఆవరణను ఫంక్షన్లకు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నట్టు తీవ్రమైన విమర్శలు లేకపోలేదు. 

హెచ్‌ఎంపై టీడీపీ నేత చిందులు
అనుమతి లేకుండా లేకుండా పాఠశాలలో ఫంక్షన్లు చేస్తుండటంపై కారకులైన టీడీపీ నాయకులను ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి ప్రశ్నించగా టీడీపీ నాయకుడు పేర్ల మషేన్‌ ఆమెపై చిందులు తొక్కాడు. సోమవారం మరో కార్యక్రమం అక్కడ జరుగుతుండటాన్ని చూసి హెచ్‌ఎం మసేన్‌తో పాటు అక్కడి వారిని నిలదీశారు. వాసవానిపాలెం గ్రామానికి పెద్దగా చలామణి అవుతున్న మషేన్‌ ప్రాంగణాన్ని మాకు నచ్చినట్టుగా వినియోగించుకుంటాం.. ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ టెంపరి సమాధానం ఇవ్వడంతో ఆమె అతగాడితో వాదించలేక మిన్నకుండిపోయారు. పాఠశాల మా అవసరాలకే వినియోగించుంటాం.. అలా చూస్తూ ఉండండి..

అవసరమైతే విద్యార్థుల తరగతుల భవనాన్ని వేరుచేస్తూ అడ్డంగా గోడకట్టేస్తాం అంటూ మసేన్‌ బెదిరింపులకు దిగాడు. లక్షల రూపాయాలతో పాఠశాల అభివృద్ధి చేసిన లయన్స్‌ క్లబ్‌ను, ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ని దుర్భాషలాడుతూ దూషించాడు. మషేన్‌తో పాటు బాంబుల పోలారావు కూడా ఇక్కడ నిత్యం నిరంకుసత్వంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా పాఠశాల అధ్యాపకులపై ఒత్తిడి తెచ్చి నిత్యం కార్యక్రమాలకు అనుమతులిస్తూ లక్షలు దండుకుంటున్నట్లు పలువురు చెప్పారు.

రూ.18 లక్షలతో అభివృద్ధి చేశాం
పాఠశాలను విచ్చలవిడి కార్యకలాపాలకు వేదికగా మార్చే హక్కు నాయకులకు ఎవరు ఇచ్చారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలోని ఈ పాఠశాల గత కొన్నేళ్ల క్రితం శిథిల భవనంలో ఉండేది. విద్యార్థుల శ్రేయసు కోరుతూ లయన్స్‌ క్లబ్‌ పాఠశాలను దత్తతు తీసుకుంది. రూ.18 లక్షలు ఖర్చు చేసి తరగతి గతులు అభివృద్ధి చేసింది. పాఠశాల ఆవరణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దింది. ఒక టీచర్‌ని కూడా నియమించాం. దీంతో పాటు నా నెలవారి పెన్షన్‌ రూ.3 వేలను కూడా పాఠశాల అభివృద్ధి కోసమే ఇస్తున్నాను. ఇంత చేసినా కొందరు స్వార్థ నాయకుల మాటలు విని ఇక్కడి వారు వారి పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేయడం బాధ కలిగిస్తోంది.
– భాస్కరరావు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధి

మరుగుకు కూడా వెళ్లలేకపోతున్నాం
తరచూ పాఠశాల ఆవరణ లో వివాహాలు, ఇతర ఫం క్షన్లు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున షామియానాలు, సౌండ్‌ సిస్టమ్‌లు, వంట సామగ్రిలతో బడి ప్రాంగణాన్ని నింపేస్తున్నారు. ఇక్కడే వంటలు చేయడం.. పాటలు పెట్టడం చేస్తున్నారు. విద్యార్థులమంతా ఇబ్బంది పడుతున్నాం. చదువులు బుర్రకెక్కడం లేదు. మైదానాన్ని ఆనుకొని ఉన్న మరుగుదొడ్డిని వినియోగించుకొనేందుకు వీలు లేకుండా పోతోంది.
– అరుణ, నాగ, 5వ తరగతి విద్యార్థినులు

చర్యలు తీసుకుంటాం
సమస్య మా దృష్టికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ ప్రతి నిధులను పాఠశాలకు పంపించాం. వారు అక్కడి పరిస్థితిని చక్కదిద్దినట్లు నివేదించారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాల ఆవరణలో ఎలాంటి ప్రైవే ట్‌ కార్యక్రమాలకు అనుమతి లేదు. మరోసారి సమస్య తలెత్తితే స్వయంగా వెళతా. 
– లింగేశ్వరరెడ్డి, డీఈవో

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement