బడి బస్సులో భద్రత ఎంత?

School Bus Fitness Expired in Visakhapatnam - Sakshi

ప్రమాణాలు పాటించని స్కూల్‌ బస్సులు

తరచూ ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు

15తో ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు పూర్తి

వచ్చే విద్యా సంవత్సరానికి  మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఆర్టీఏ అధికారులు

కంటికి రెప్పలా కాపాడుకుంటూ అరచేతుల్లో పెట్టుకుని పెంచుకునే పిల్లలకు చిన్నపాటి గాయమైనా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తమ పిల్లల భవిష్యత్‌ బంగారుమయం కావాలన్న తాపత్రయంతో  దూరంగా ఉన్నా మంచి పాఠశాలలను ఎంచుకుని  ఆ పాఠశాల బస్సుల్లో ప్రతి రోజూ పంపిస్తారు. వారు తిరిగి ఇంటికి చేరే వరకూ అటువైపే దృష్టి ఉంటుంది. అయితే చాలా పాఠశాలల యాజమాన్యాలు స్కూల్‌ బస్సుల విషయంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి.  

అనకాపల్లి: అధిక శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు.  ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, బోధన, ఇతర అభ్యసన ప్రక్రియలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు కోరుకునే  పాఠశాలకు వారి పిల్లలను పంపాలంటే ఆయా పాఠశాలలకు చెందిన బస్సులే కీలకం. అయితే డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయమైన కొన్ని విద్యాసంస్థలు బస్సుల నిర్వహణ, సిబ్బంది విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోడ్డు రవాణాశాఖ అధికారులు పాఠశాల బస్సుల నిర్వహణలో పలు మార్గదర్శకాలు రూపొందించినా.. వాటిని కేవలం ఏడాదికొకసారే పరిశీలన జరిపి వదిలేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బడులకు వెళ్లేటప్పుడు ఆయా విద్యాసంస్థల బస్సులు ఢీకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది నెలలు క్రితం అనకాపల్లి మండలంలోని కూండ్రంలో ఆడుతున్న చిన్నారులపైకి ఒక బస్సు వెళ్లి బలితీసుకుంది.

అనకాపల్లి పరిసరాల్లో ఉన్న కొన్ని పాఠశాలలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. గత విద్యాసంవత్సరంలో మూసివేసిన ఓ పాఠశాలకు చెందిన బస్సు బైపాస్‌రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సు ముందు ఉన్న అద్దం బద్దలైంది తప్ప చిన్నారులకు గాయాలు కాలేదు. రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల వినోదయాత్ర నిమిత్తం యారాడ బీచ్‌కు విద్యార్థులను తీసుకెళ్లింది.  తిరిగి వస్తుండగా బస్సులు ప్రమాదానికిగురి కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. పిల్లలకు తీవ్ర గాయాలైనప్పటికీ ఎవరూ చనిపోకపోవడంతో అటు అధికారులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాసంస్థలను నిర్వహించే యాజమాన్యాల ఆర్థిక పరిస్థితి బట్టి బస్సుల కొనుగోలు ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలకు సెకెండ్‌హ్యాండ్‌ బస్సులను కొనుగోలు చేస్తుంటారు. ఇటువంటి బస్సుల్లో రోడ్డు రవాణా శాఖ అధికారులు విధించిన ప్రమాణాలు ఉండవనేది అందరికీ తెలిసిందే. అయితే ఎటువంటి ఉపద్రవం ఎదురుకానంత వరకు ఎవరూ పట్టించుకోరు.

15తో ముగియనున్న బస్సుల ఫిట్‌నెస్‌ గడువు 
అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయ పరిధిలో సుమారు 1,400 ప్రైవేటు   పాఠశాలల బస్సులు ఉన్నాయి. ఆయా పాఠశాల బస్సులు  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఈ బస్సులను ఉపయోగించాలంటే తక్షణమే ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను పొందాలి. ఆయా బస్సుల్లో మెడికల్‌  కిట్, డ్రైవర్, క్లీనర్, ఫైర్‌సేఫ్టీ కిట్, బస్సు తిరిగే రూట్‌మ్యాప్‌ ఉండాలి. బస్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌  చేస్తే మిగతా ప్రక్రియ ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆయా పాఠశాల బస్సుల్లో చివరి విద్యార్థి దిగే వరకూ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. డ్రైవర్‌కు లైసెన్స్‌తోపాటు హెల్త్‌కార్డు, మూడు నెలలకొకసారి సబ్‌మిట్‌ చేస్తుండాలి. మద్యం తాగే వ్యక్తిని, కంటిచూపు మందగించిన వారిని స్కూల్‌ బస్‌ డ్రైవర్లుగా ఉపయోగించరాదు. వీటన్నింటిని పర్యవేక్షించిన అనంతరం ఆర్టీఏ అధికారులు బస్సుకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఈ నిబంధనలు పాటిస్తేనే సర్టిఫికెట్‌
బస్సు ఎడమ వైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపరచాలి
బస్సు బయలుదేరు సమయం, ఆగు స్థలాలు, రూల్‌ప్లాన్‌ బస్సులో ఉంచాలి
విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు  చేయాలి, సీట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా విద్యార్థులతోప్రయాణించాలి.
డ్రైవర్‌కు కనీసం ఐదేళ్ల అనుభవం, ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రువీకరించు హెల్త్‌కార్డు ఉండాలి.
ప్రతి నెలా బస్సు కండీషన్‌ను యాజమాన్యం, పేరెంట్స్‌ కమిటీ తనిఖీ చేయాలి.
ఫిర్యాదుల పుస్తకం బస్సులో ఉంచాలి. పుస్తకాన్ని ప్రతీనెలా యాజమాన్యం తనిఖీ చేసి, ఫిర్యాదులు పరిశీలించాలి.
బస్సుకు కన్వెన్స్‌క్రాస్‌ అద్దాలు అమర్చాలి. లోపలి భాగంలో పెద్ద పారదర్శక అద్దం ఉండాలి.
అత్యవసర ద్వారం, ప్రథమ చికిత్స మందులు వాహనంలో ఉంచాలి
బస్సులను ఆయా విద్యా సంస్థలకు చెందిన పార్కింగ్‌ స్థలాల్లో  ఉంచాలి.
ప్రతీ బస్సుకు అటెండర్‌ ఉండాలి. డ్రైవర్, అటెండర్‌ యూనీఫారం ధరించాలి.
బస్సు డ్రైవర్‌ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే శిక్షణతరగతులకు హాజరుకావాలి
విడతల వారీగా బస్సులో టీచర్లు ప్రయాణించేలా  చూసి,  విద్యార్థుల సంరక్షణను పర్యవేక్షించాలి.

క్షుణ్ణంగా పరిశీలించాకే...
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తాం. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటింటిచాలి. వాహనం కండిషన్‌లో లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సర్టిఫికెట్‌ నిరాకరిస్తాం. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు   ఈనెల 15వతేదీలోగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలి.   నిబంధనల మేరకు బస్సులో సదుపాయాలు కల్పించాలి.   – రవీంద్రనాథ్, ఆర్టీవో 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top