అనంతపురం జిల్లాలోని నగర పాలక పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమిస్తామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది.
అనంతపురం : అనంతపురం జిల్లాలోని నగర పాలక పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమిస్తామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హెచ్చరించింది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే పెద్దన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా కార్పొరేషన్ చేరుకుని మేయర్ స్వరూపకి వినతిపత్రం అందజేశారు. సమస్యలను మేయర్‌కి వివరించారు.
ప్రధానంగా ఐదు సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. యాజమాన్యం అలసత్వ ధోరణి సర్వీసుపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఉపాధ్యాయులు నష్టపోయేలా చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వెంకటనారాయణ, నాయకులు బండారు శంకర్, ఎంటీఎఫ్ నాయకులు రమేష్, రాంనాయక్, ఇతర సంఘాల నాయకులు రామాంజనేయులు, రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.