హైకోర్టు విభజనపై సుప్రీం కీలక నిర్ణయం

SC Rejects Plea Filed By AP High Court Advocates Association - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టులు కార్యకలాపాలు ప్రారంభించినందున తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది. ఆరంభంలో చిన్నచిన్న సమస్యలు మామూలేనని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు ఏపీ న్యాయవాదుల సంఘానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవన నిర్మాణం ఇంకా పూర్తికానందున రాష్ట్రపతి జారీ చేసిన హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలని ఏపీ న్యాయవాదుల సంఘం, ఆ సంఘం ఉపాధ్యక్షుడు కె. సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, విజయవాడలో తాత్కాలిక భవన సముదాయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహా న్యాయమూర్తులు అందరూ విధులకు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో 13 మంది న్యాయమూర్తులతో నిన్న గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top