ఎత్తిపోతలకు స్వస్తి చెప్పాలి.. | Say NO to lift .. | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతలకు స్వస్తి చెప్పాలి..

Mar 14 2015 2:24 AM | Updated on Aug 21 2018 8:34 PM

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో....

అమలాపురం : పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో రైతులు శుక్రవారం ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. పట్టిసీమ పథకానికి కేటాయించిన నిధులను బహుళార్థ సాధకమైన పోలవరం ప్రాజెక్టుకు కేటాయించాలని ప్రభుత్వానికి  సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లు కేటాయించి రాబోయే నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని గమనిస్తే రైతుల పట్ల ప్రభుత్వాలకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వడంలో తెలంగాణ తో పోటీపడ్డ రాష్ట్ర ప్రభుత్వం.. అత్యంత ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టుకు కేటాయింపులో పోటీ పడలేదని రైతులు ఆరోపించారు. తెలంగాణ  ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.8,500 కోట్లు కేటాయించగా మన రా్రష్ట్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు కేవలం రూ.30 కోట్లు కేటారుుంచడాన్ని, గోదావరి నీళ్లు కృష్ణాకు తరలించే ఆలోచనను భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండించింది.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి  అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి నిధులు కేటాయించేలా చేయడానికి  కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీకేఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల జమీలు వివరించారు. బీకేఎస్ నాయకులు ఉప్పుగంటి భాస్కరరావు, దొంగ నాగేశ్వరరావు, యాళ్ల వెంకటానందం, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, అడ్డాల గోపాలకృష్ణ, బొక్కా ఆదినారాయణ, సరెళ్ల అప్పారావు, గుద్దటి జమి, గుత్తుల శ్రీరామ్మూర్తి, రంబాల బోసు, అయితాబత్తుల బుచ్చిబాబు, కల్వకొలను తాతాజీ, కొప్పుల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement