రాష్ట్రంలో రాచరికపు పాలన

Save AP from family rule,says ex-CS Ajeya Kallam - Sakshi

ఏపీలో అవినీతి తారాస్థాయికి చేరింది.. వ్యవస్థలన్నీ ధ్వంసం

నెల్లూరు ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సభలో మాజీ సీఎస్‌ అజేయ కల్లం వ్యాఖ్య

రైతులను ఆదుకోవడానికి డబ్బులుండవుగానీ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, విమాన కంపెనీలకు రాయితీలా?

ప్రభుత్వమే దీక్షలు చేయడం ఎక్కడైనా చూశామా?

లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో నాన్‌ బడ్జెట్‌ పేరుతో రూ.60 వేల కోట్ల అప్పు ఏమిటి?

అసెంబ్లీ అనుమతి లేకుండానే రూ.27 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?

అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ.వందల కోట్లు సంపాదిస్తున్నారు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రాజరికపు పాలన, కుటుంబ పెత్తనం వల్ల వ్యవస్థలన్నీ ధ్వంసం కాగా వ్యవస్థీకృత అవినీతి తారా స్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు నుంచి మట్టి వరకు, అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుకొని ప్రభుత్వ దుబారా వరకు రూ.వేల కోట్ల ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నెల్లూరు టౌన్‌హాల్‌లో ‘మనం కోసం మనం’ నేతృత్వంలో జరిగిన ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజేయ కల్లం ఇంకా ఏం చెప్పారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

రైతులకు మొండిచెయ్యి.. కంపెనీలకు భూములా?
‘రైతులకు సబ్సిడీలు, రుణాలు, కనీస మద్దతు ధర ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు, విమానాల కంపెనీలకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు మాత్రం భూమితో పాటు రాయితీలు భారీగా ఇస్తోంది. విజయవాడ – సింగపూర్‌ విమానాలు నడిపే ఇండిగో సంస్థకు రూ.18 కోట్లు సబ్సిడీ ఇస్తూ గత నెల 27న జీఓ జారీ చేసి ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. విమాన సంస్థలకు ఎదురు డబ్బులిచ్చి మరీ విమానాలు ఎందుకు నడిపిస్తున్నారు? విమానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సింగపూర్‌ వెళ్లడానికా? లేక రాజధానిలో 1,600 ఎకరాలు కేటాయించిన సింగపూర్‌ కంపెనీ కోసమా? ఇదేనా ప్రజారంజక పాలన అంటే? విమాన కంపెనీలు, స్టార్‌ హోటళ్లకు  రాయితీలు ఇవ్వడం కంటే అర్బన్‌ ప్రాంతాల్లో  ఉచితంగా వసతి గృహాలు నిర్మించి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. 

దీక్షల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం..
రాష్ట్రంలో దీక్షల పేరుతో రూ.కోట్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 50 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ప్రభుత్వమే దీక్షలు చేయడం చూశామా? హెచ్‌సీఎల్‌ కంపెనీ అధినేత శివనాడార్‌ తిరుపతిలో కంపెనీ పెడతానంటే అమరావతికి తీసుకొచ్చి రూ.700 కోట్లు విలువ చేసే 49 ఎకరాల భూమి, 12 ఏళ్ల పాటు రూ. 2,223 కోట్ల రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 

ప్రశ్నించలేని ఎమ్మెల్యేలు ఉన్నంతవరకూ ఇదే పరిస్థితి
పేదల ఇళ్ల నిర్మాణ పథకంలోనూ భారీగా అవినీతి జరుగుతోంది. తెలంగాణలో ఒక చదరపు అడుగు నిర్మాణానికి కేసీఆర్‌ ప్రభుత్వం రూ.800 చొప్పున కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,900 నుంచి రూ.2,700 వరకు కంపెనీని బట్టి ఇస్తున్నారు. ధరలో ఇంత తేడా ఎందుకో ప్రశ్నించలేని ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ అంశాలపై ఓ సాధారణ వ్యక్తిగా నేను మాట్లాడితే ‘‘మీరు ఏ పార్టీ? మీకు ఏం పని..?’’ అంటూ ప్రశ్నించే హక్కే లేదన్నట్లుగా మంత్రులు మాట్లాడడం దారుణం.

సాగునీటి ప్రాజెక్టుల్లో 40 శాతం దోపిడీ
సాగునీటి ప్రాజెక్టుల్లో 35 నుంచి 40 శాతం ప్రజాధనాన్ని దోచుకుని తింటున్నారు. మళ్లీ ఆ డబ్బులనే  రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి వారి గణాన్ని ఎన్నికల బరిలో దించుతున్నారు. రాష్ట్రంలో నిపుణులైన  ఇంజనీర్లను ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లి జరిగిన పనుల విలువ లెక్కిస్తే వాస్తవాలు తెలుస్తాయి. 

రాజధాని పేరుతో రూ.60 వేల కోట్లు దుర్వినియోగం
రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకు అసెంబ్లీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ అసెంబ్లీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, సభలో కనీసం చర్చించకుండా, ఓటింగ్‌ నిర్వహించకుండా రూ.27 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? కాగ్‌ తప్పుబట్టినా ఒక్క ఎమ్మెల్యే కూడా దీన్ని ప్రశ్నించలేదు. లోటు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో నాన్‌ బడ్జెట్‌ పేరుతో రూ.60 వేల కోట్లు అప్పు తీసుకోవడం ఏమిటి? రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటే ఖర్చులు నియంత్రించుకోకుండా రూ.60 వేల కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలు ఎందుకు? రూ.100 కోట్ల ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మించుకుంటే ప్రజాధనం లూటీ అయ్యేది కాదు. ప్రజాభిప్రాయానికి తావులేకుండా చేసి వ్యవస్థల్ని ప్రభుత్వం నాశనం చేస్తోంది. 

వైఎస్‌ మొండి ధైర్యంతో పోలవరంపై ఖర్చు చేశారు
పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను 1930లోనే గుర్తించారు. తర్వాత 1970లో ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొండి ధైర్యంతో పోలవరంపై రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం దీన్ని చట్టంలో పొందుపరిచి నాబార్డు ద్వారా నిధులు ఇచ్చింది. కానీ మన పాలకులు పోలవరాన్ని తాము పూర్తి చేస్తే అపరభగీరథులు అవుతామని, తమని ఓడించే వాళ్లే ఉండరని క్రెడిట్‌ అంతా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం మూలంగానే పోలవరం అభివృద్ధిలో పురోగతి లేదన్నారు. 

రాజధాని రియల్‌ ఎస్టేట్‌ డబ్బుతో ఎన్నికలకు సిద్ధం
రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను కనీసం చూడకుండానే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించేసి రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని తీసుకుంది. ఇందులో 5 నుంచి వేల ఎకరాల భూమిని ఎమ్మెల్యేలు, మంత్రులు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ భూమిగా మార్చేశారు. వీటి ద్వారా వచ్చే అవినీతి డబ్బును మళ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఉచిత ఇసుక పేరుతో దోపిడీ
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలదే రాజ్యంగా మారిపోయింది. వారికి తెలియకుండా ఏదీ జరగదు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు అన్నీ డబ్బులు తీసుకుని చేస్తున్నారు. అనేక చోట్ల ‘‘ఎమ్మెల్యే టాక్స్‌’’ ఉంది. కనీసం మెడికల్‌ షాపు ఏర్పాటు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేకు ట్యాక్స్‌ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీలు మితిమీరిన పెత్తనంతో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయింది. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి తెర తీశారు. ఉచితం అని చెప్పి భారీ ధరకు అమ్ముతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో నదులు తక్కువ కావడంతో ఇసుక మనకు లభించినంతగా దొరకదు. అక్కడ ఇసుక అమ్మకం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తే, మన రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు రావాలి, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇదంతా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లే తినేస్తున్నారు. ఒక రకంగా పూర్తి వ్యవస్థీకృత దోపిడీ కొనసాగిస్తున్నారు. 

కార్యకర్తలు కాదు.. పెయిడ్‌ వర్కరŠస్స్‌
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ. వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఉపాధిహామీ పనులు రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్లు జరిగితే అన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. కార్యకర్తలకు ఒక రకమైన ప«నులు, ఎమ్మెల్యేలకు మరో రకమైన పనులు, మంత్రులకు ప్రాజెక్టులు... ఇలా పంచుకొని మరీ దోపిడీ కొనసాగిస్తున్నారు. వాళ్లు కార్యకర్తలు కాదు... పెయిడ్‌ వర్కర్స్‌. 

లోకేష్‌ కోసం కుటుంబ పాలన..
మంత్రి లోకేష్‌ కోసం మరో 25 నుంచి 30 మంది వారసులకు టికెట్లు ఇచ్చి కుటుంబ పాలన కొనసాగించనున్నారు. అనుభవం, అవగాహన లేనివారిని, కనీసం సర్పంచ్‌గా గెలవలేని వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేసి మంత్రులుగా చేస్తున్నారు. వారికి కనీసం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో కూడా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో లేని రాజధాని నిర్మాణం, ఇతర అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా వ్యవహరించటం సరికాదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top