‘ఖర్మా’గారంలో నుజ్జయిన జీవితం | satti babu dead with the negligence of management | Sakshi
Sakshi News home page

‘ఖర్మా’గారంలో నుజ్జయిన జీవితం

Jul 16 2014 12:35 AM | Updated on Sep 2 2017 10:20 AM

‘ఖర్మా’గారంలో నుజ్జయిన జీవితం

‘ఖర్మా’గారంలో నుజ్జయిన జీవితం

యాజమాన్యం నిర్లక్ష్యం మరో కార్మికుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎస్‌ఈజెడ్‌లో ఉత్పత్తి చేపడుతున్న ఆంజనేయ ఎల్లాయ్స్ పరిశ్రమలో మంగళవారం విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

అచ్యుతాపురం:  యాజమాన్యం నిర్లక్ష్యం మరో కార్మికుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎస్‌ఈజెడ్‌లో ఉత్పత్తి చేపడుతున్న ఆంజనేయ ఎల్లాయ్స్ పరిశ్రమలో మంగళవారం విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలివి. రాంబిల్లి మండలం లోవపాలేనికి చెందిన బొంది సత్తిబాబు(28) మంగళవారం ఉదయం ‘ఎ’ షిప్టుకి వెళ్లాడు. పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నిస్ వద్ద మరిగిన లోహపు ద్రావణం నింపిన పాత్రలకు క్రేన్ హుక్కులను తగిలించే పనిలో ఉన్నాడు. హుక్కుతాడు తెగిపోవడంతో అరటన్ను బరువు గల హుక్కు అతని తలపై పడి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు.
 
యాజమాన్యం వెంటనే సత్తిబాబు మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న సత్తిబాబు కుటుంబసభ్యులు, మత్స్యకారసంఘాల నాయకులు, సీఐటీయు నాయకులు వెంటనే పరిశ్రమకి వచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందివచ్చిన కొడుకు దూరం కావడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకారసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు.
 
రూ.20 లక్షల పరిహారం
ప్రమాదంపై ఆందోళనలతో దిగి వచ్చిన పరిశ్రమ యాజమాన్యం మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి సమ్మతించింది. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, దహన ఖర్చులకు రూ.యాభై వేలు, కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించింది.
 
యాజమాన్యం నిర్లక్ష్యమే..
ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కార్మికలు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో వివిధ లోహాల మిశ్రమాన్ని మరిగించి ఎల్లాయ్ అచ్చులను తయారు చేస్తారు. బ్లాస్ట్ ఫర్నిస్‌కి పది అడుగుల సమీపంలోనే కార్మికులు పనిచేస్తున్నారు. అధిక వేడి, పొగ వద్ద వారు గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది. మరిగిన ద్రవ లోహపు ముద్దలు ఎక్కడికక్కడ పడుతున్నాయి.

భద్రత రిత్యా బ్లాస్ట్‌ఫర్నిస్ వద్ద పని చేసేవారికి ప్రత్యేక సూట్, బూటు, హెల్మెట్ ఇవ్వాలి. అయితే ఇక్కడి యాజమాన్యం కార్మికులకు నాణ్యత లేని భద్రతా పరికరాలను అందించింది. ఆరు నెలలకొకసారి భద్రత పరికరాలను మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్లతరబడి అవే పరికరాలతో పనిచేస్తున్నామని,సామగ్రిని మార్చమని కోరితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని కార్మికులు వాపోతున్నారు.
 
అండ కోల్పోయారు...
మృతుడు సత్తిబాబుకు తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, అక్క, చెల్లెలు ఉన్నారు. అన్న అమ్మోరు వికలాంగుడు. చెల్లెలు శ్రీదేవికి పెళ్లి చేయాల్సి ఉంది. కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు అండగా ఉన్న సత్తిబాబుకు మూడేళ్ల క్రితం దేవితో పెళ్లయ్యింది. కుటుంబానికి అండగా ఉండే సత్తిబాబు ఇలా దుర్మరణం పాలవ్వడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
 
పర్యవేక్షణ లేదు...
ద్రవ రూపంలో ఉన్న లోహాన్ని బకెట్లలో తరలించి అచ్చువేసే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైంది. ద్రావణం పైన పడితే చావడం తధ్యం. అందువల్ల ప్రతిరోజు క్రేన్ తాళ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేక సాంకేతిక నిపుణులు పరీక్షించాలి. కానీ లాభాల కోసం తాపత్రయ పడే పరిశ్రమ యాజమాన్యం తగినంత సిబ్బందిని నియమించడం లేదు. బ్లాస్ట్ ఫర్నిస్ వద్ద పనిచేసే కార్మికులు గంటకొకసారి ఏసీ గదిలో విశ్రాంతి తీసుకోవాలి. అలాంటి ఏర్పాట్లు ఇక్కడ లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement