అంతా నా ఇష్టం!

Sarvajana Hospital Staff Shortage Anantapur - Sakshi

వివాదాస్పదంగావిధుల మార్పు   

ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలు

కరెంటు కష్టాలతో నరకం చూస్తున్న రోగులు  

డైలీ కూలీలతో పని చేయిస్తున్న వైనం

సూపరింటెండెంట్‌ తీరుపై  విమర్శల వెల్లువ

ఈ చిత్రంలో అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌(ఏఎంసీ)లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్‌. ఈయన వాస్తవానికి ఎలక్ట్రీషియన్‌ ఈసీజీ తీసేందుకు ఎలాంటి అర్హత లేకయినా ఆస్పత్రి యాజమాన్యం ఆయనకే బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.  

ఈ చిత్రాన్ని చూడండి.ఆస్పత్రిలోని రేడియాలజీ     విభాగంలోని డార్క్‌ రూంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ వ్యక్తి పేరు సురేష్‌. ఈయన కూడా ఎలక్ట్రీషియనే. కానీ కొన్ని నెలల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఈయన విధులను మార్చారు.

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలక పోస్టులో ఉన్న ఆయన కొందరి సిబ్బంది విధులు మార్చడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలందించే పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రీషియన్లు పూర్తీ స్థాయి పని చేయకపోవడంతో రోగులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. 

ఆస్పత్రిలో కరెంటు కష్టాలు..
సర్వజనాస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ కింద ఇద్దరు ఎలక్ట్రీషియన్లు 19 ఏళ్లుగా పని చేసేవారు. వీరిద్దరినీ ఆ విధుల నుంచి తప్పించి ఇతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు దిన కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వారు రౌండ్‌ ద క్లాక్‌ అందుబాటులో ఉండటం లేదు. అందులోనూ ఆస్పత్రిపై పూర్తీ స్థాయిలో అవగాహన లేదు. చెడిపోయిన ఫ్యాన్లు, లైట్లను ఎప్పటికప్పుడు రిపేరీ చేయాల్సిన ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో గైనిక్, లేబర్, పోస్టునేటర్, సర్జరీ, మేల్, ఫీమేల్‌ హౌస్‌సర్జన్‌ హాస్టళ్లలో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారం రోజుల క్రితం కరెంటు పోతే సకాలంలో స్పందించి జనరేటర్‌ కూడా వేయలేని స్థితిలో ఎలక్ట్రీషియన్లున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

నిద్రమత్తులో జిల్లా అధికార యంత్రాంగం  
ఆస్పత్రిలో రోజుకో అడ్డగోలు బాగోతం బయటపడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన స్తంభించి తాము ప్రత్యక్ష నరకం చూస్తున్నా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సమస్యగా ఉంటే మార్చా
సుధాకర్‌కు ఎలక్ట్రీషియన్‌ పని చేతకాదు. ఉద్యోగంలో చేరే సమయంలో ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపర్చాడో అర్థం కావడం లేదు. ఈసీజీ ట్రైనింగ్‌ ఇచ్చి పని చేయిస్తున్నా. ఇక సురేష్‌ ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో మానవతా దృక్పథంతో మార్చా. అందుబాటులో ఉన్న వారితో పని చేయిస్తున్నాం.– డాక్టర్‌ జగన్నాథ్‌(ఆస్పత్రి సూపరింటెండెంట్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top