ఇప్పటికీ వారు సర్పంచ్‌లే!

Sarpanch Names on Village Welcome Boards - Sakshi

పదవి ముగిసి 7 నెలలు గడిచినా తొలగని బోర్డులు

గ్రామ ముఖద్వారాల వద్ద ఏర్పాటు చేసిన స్వాగతం

బోర్డులపై సర్పంచ్‌ల పేర్లు అధికార పార్టీ నాయకులు

కావడమేనంటూ విమర్శలు

పశ్చిమగోదావరి, భీమవరం: పదవులు ముగిసి నెలలు గడిచిపోతున్నా గ్రామాల్లో స్వాగతం బోర్డులపై వారి పేర్లు మాత్రం మెరిసిపోతూనే ఉన్నాయి. గ్రామాల్లో నేటికీ వారిదే పెత్తనం. అ«ధికార పార్టీ అండతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వారి ప్రమేయంతోనే జరగడం విశేషం. ఇది పంచాయతీ సర్పంచ్‌ల కథ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందంటూ హడావుడిగా రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించడమే కాకుండా దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 2న సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి పోయినా నేటికీ గ్రామాల ముఖద్వారాలు, గ్రామ శివార్లలో సర్పంచ్‌ల పేరిట ఏర్పాటు చేసిన స్వాగతం బోర్డులు మాత్రం నేటికీ తొలగించకపోవడం విశేషం.

ఐదున్నరేళ్ల కిందట రాష్ట్రమంతా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి ఎన్నికల్లో అధికార టీడీపీ, వైఎస్సార్‌ సీపీలకు చెందిన నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావటంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన సర్పంచ్‌లను అభివృద్ధి పనుల ఆశ చూపించో, భయపెట్టో టీడీపీ నాయకులు ఆ పార్టీలోకి లాగేశారు. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచ్‌లు అధికార టీడీపీ పంచన చేరారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లోను సర్పంచ్‌ పేరుతో గ్రామ ముఖద్వారం, గ్రామశివార్లలో స్వాగతం బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం మినహా మిగిలిన 14 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నిక కావటంతో కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఫొటోతో సహా స్వాగతం బోర్డులు వెలిశాయి.

పదవులు ముగిసి 7 నెలలైనా..
సర్పంచ్‌ల పదవీ కాలం గత ఏడాది ఆగస్టు 2తో ముగిసింది. జిల్లాలో సర్పంచుల్లో ఎక్కువ శాతం టీడీపీకి చెందినవారు కావడంతో వారి పదవీ కాలం ముగిసి 7 నెలలు గడిచినా నేటికీ ఎక్కడా బోర్డులు తొలగించలేదు. అధికార పార్టీ నాయకులు కావడంతో ఇప్పటికీ ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్‌లే పెత్తనం చెలాయిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక మాజీల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గ్రామ స్థాయి అధికారులు కూడా  మాజీల అడుగులకు మడుగులొత్తుతూ వారి చెప్పిందే వేదంగా పనులు చక్కబెడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా మాజీ సర్పంచ్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తమకు తిరుగులేదనే విధంగా మాజీల ప్రవర్తన ఉంది.

ఎన్నిల కోడ్‌ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించినా..
గత నెలలో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో పట్టణాలు, గ్రామాల్లో నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆగమేఘాల మీద తొలగిస్తున్నారు. దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. పదవీ కాలం ముగిసి నెలలు గడిచిపోతున్నా సర్పంచ్‌ల బోర్డులు తొలగించటంపై దృష్టి సారించకపోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గ్రామ ముఖద్వారాల వద్ద ఏర్పాటు చేసిన స్వాగతం బోర్డులపై మాజీ సర్పంచ్‌ల పేర్లు తొలగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top