పెన్నా 'కాలవ'

Sand Smuggling in Pamidi Penna Canal - Sakshi

ఉనికి కోల్పోయిన నది

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాల పేరిట తవ్వకాలు

మంత్రి కాలవ అండదండలు

అడ్డూ అదుపు లేని యంత్రాల వినియోగం

రోజూ తరలిపోతున్న వంద టిప్పర్ల ఇసుక

పామిడిలో మితిమీరిన ఆక్రమణలు

మామూళ్ల మత్తులో పోలీసులు

మంత్రి కాలవ శ్రీనివాసులు.. రాయదుర్గం నియోజవర్గానికి ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ ఐదేళ్లూ ఇసుక అక్రమ రవాణాతో రూ.కోట్లకు పడగలెత్తారనే చర్చ ఉంది. ఇప్పటికే అక్కడి వేదవతి హగరి నది రూపు రేఖలు కోల్పోయింది. ప్రస్తుతం పామిడిలోని పెన్నానది పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాల పేరుతో ఈ ప్రాంతం నుంచి ఇసుకను భారీ స్థాయిలో పెద్ద పెద్ద నగరాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి అండ చూసుకుని స్థానిక టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాతో స్థానిక నేతలే రూ.కోట్లు వెనకేసుకుంటుంటే.. ఇక మంత్రిగారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

అనంతపురం, పామిడి :పామిడి పెన్నానది ఒకప్పుడు జీవకళతో గలగలపారేది. నిండైన ఇసుక మేటలు.. పాయలుపాయలుగా పారుతున్న నీటితో చూడ ముచ్చటేసేది. 30 సంవత్సరాల క్రితం వరకూ పామిడి చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల మేర ఎక్కడ తవ్వినా 15 అడుగుల్లోపు సమృద్ధిగా నీరు లభ్యమయ్యేది. బంగారు పంటలు పండేవి. ఏనాడూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడింది లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టీడీపీ నేతలు అడ్డగోలుగా ఇసుక తరలిస్తుండటంతో పామిడి పెన్నానది నామరూపాల్లేకుండా పోయింది. దురాక్రమణలతో నది కాస్త కాలవగా మారిపోయింది.

ఐఓసీ పేరుతో కొంత కాలం..
గతంలో పామిడి పెన్నానది నుంచి గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఇసుకను భారీగా తరలించారు. ఐఓసీ పేరుతో అక్రమ రవాణా కొనసాగించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకూ ఇక్కడి నుంచి ఇసుక ఎగుమతులు చేసి రూ.కోట్లలో లబ్ధి పొందారు. ఇసుక తవ్వకాలతో పామిడి బైపాస్, రైల్వే వంతెనలకు ముప్పు పొంచి ఉంది. వంతెనలకు దిగువన ఇసుక కోసం జేసీబీలతో తోడేయడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో వంతెనలు కూలిపోయే ప్రమాదముందంటూ స్థానికులు, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తాత్కాలికంగా ఇసుక తరలింపులకు అప్పట్లో టీడీపీ నేతలు స్వస్తి పలికారు.  

కాలవ కన్ను పడి..  
తాజాగా పామిడి పెన్నానది నుంచి భారీగా ఇసుక తరలింపులు మొదలయ్యాయి. జేసీబీలను ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లూ టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. రోజూ వందకు పైగా టిప్పర్లలో ఇసుక తరలిపోతోంది. గుంతకల్లు పరిధిలో టిడ్నో కంపెనీ చేపట్టిన ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలకు ఇసుకతరలించుకునేందుకు సాక్షాత్తూ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఓ సిఫారసు పత్రాన్ని రవాణాదారులు చూపిస్తూ అక్రమంగా ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంపాదనలో సింహభాగం మంత్రి వాటాగా తెలుస్తోంది.  

నిర్మాణాలు చేపట్టకనే..  
గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు అంటూ తరలిస్తున్న ఇసుక వాస్తవానికి అక్కడకు చేరడం లేదు. గుంతకల్లు నుంచి 15 కిలోమీటర్లు దాటగానే జిల్లా సరిహద్దులు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. తొమ్మిది టిప్పర్లకు అనుమతులు ఉన్నాయంటూ 40 టిప్పర్లతో రేయింబవళ్లూ వందకు పైగా ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పైగా నిబంధనలకు వ్యతిరేకంగా పెన్నానదిలో జేసీబీలను ఉంచి ఇసుకను తోడేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి వంటి నగరాలకు ఇసుకను తరలిస్తే టిప్పర్‌కు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఒక రోజుకు వంద టిప్పర్లకు రూ.కోటి వరకు దోపిడీ చేస్తున్నారు. 

పోలీసులకూ వాటా
ఇసుక అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకోకుండా ఉండేందుకు పోలీసులను తెలుగు తమ్ముళ్లు ప్రభావితం చేశారు. భారీ మొత్తంలో పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ తమ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇందులో విజిలెన్స్‌ శాఖకూ వాటాలు ఉన్నట్లు సమాచారం. పట్టపగలే పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఇసుక లోడుతో టిప్పర్లు వెళుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.   

సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌ నిర్మించాలి
ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలతో ప్రస్తుతం పెన్నానది ఉనికి కోల్పోయింది. 200 అడుగుల లోతున తవ్వినా నీరు లభ్యం కావడం లేదు. దీంతో పామిడిలోనే నీటి ఎద్దడి మొదలైంది. నాలుగు రోజులకొకసారి కొళాయిల ద్వారా నీరు అందితే గొప్ప విషయమే. ఇసుక అక్రమ రవాణా, ఆక్రమణలు అరికట్టాలంటే పామిడి వద్ద పెన్నానదిపై సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌ నిర్మించాలి.  – బసవరెడ్డి, పామిడి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top