ఇసుక దొంగలు

Sand Mafia In Anantapur - Sakshi

యథేచ్ఛగా అక్రమ రవాణా

శ్మశానాన్నీ వదలకుండా ఇసుక తవ్వకాలు

అక్రమ రవాణాను అడ్డుకున్న పుల్లలరేవు గ్రామస్తులు

అడ్డుచెప్పిన వీఆర్వోపై ఇసుకాసురుల దాడి  

సంపాదన కోసం ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలే కాదు చివరకు శ్మశానాలనూ వదల్లేదు. ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ తోడేశారు. నిబంధనలను పక్కన పెట్టేసి ఎడాపెడా తవ్వేయడంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఎవరైనా అభ్యంతరం తెలిపితే వారిపై దాడులకు సైతం తెగబడ్డారు. ఇసుకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు.

అనంతపురం, రాప్తాడు: రాప్తాడు మండలంలోని పండమేరు వంక నుంచి అధికార పార్టీ అండదండలతో కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సిమెంటు ప్లాస్టింగ్‌కు ఉపయోగమయ్యే ఇసుక వంకలో లభించకపోవడంతో ఇసుకాసురుల కన్ను పుల్లలరేవు గ్రామ శ్మశానవాటికపై పడింది.  పది రోజుల క్రితం హిటాచీని తెప్పించి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించుకుపోయారు. ఉదయం ఆరు గంటలకల్లా శ్మశానాన్ని ఖాళీ చేసేశారు. శ్మశానం పైభాగా తోటలు ఉన్న రైతులు రాత్రికి రాత్రి ఇసుక మాయం అవుతోందని, ఎవరో తోలుతున్నారని అనుకునేవారు. రెండు రోజులు కాపలా కాచినా వారికి సదరు వ్యక్తులు తారసపడలేదు. రోజులో నాలుగైదుసార్లు ఇసుకాసురులు 100 టిప్పర్ల ఇసుకును బయటకు తరలించేవారు. శ్మశాన స్థలం మొత్తం గుంతలు పడుతుండటంతో గ్రామస్తులు ఎలాగైనా ఇసుక దొంగలను పట్టుకోవాలని గురువారం రాత్రి శ్మశానం దగ్గర కాపలా కాశారు. 

అర్ధరాత్రి తర్వాత ఇసుక రవాణా
ముందస్తు సమాచారంతో ఇసుకాసురులు అప్రమత్తమయ్యారు. కాపలా కోసం వచ్చిన గ్రామస్తులు అర్ధరాత్రి 12 గంటలకు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన ఇసుకాసురులు హిటాచీతో తవ్వకాలు చేపట్టారు. ఐదు టిప్పర్ల ద్వారా దాదాపు 100 ట్రిప్పుల ఇసుకను బయటకు తరలించేశారు. ఒకోŠక్‌ టిప్పర్‌ ఇసుకకు రూ.15 వేలు ధర పలుకుతోంది. రాత్రికి రాత్రే రూ.15 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణా చేసేశారు.

ఇసుక తవ్వకాలను  అడ్డుకున్న గ్రామస్తులు
శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామస్తులు శ్మశానం దగ్గరకెళ్లి ఇసుక తవ్వుతున్న వారిని అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించరాదంటూ ఘర్షణకు దిగారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో డ్రైవర్లు టిప్పర్లలో ఉన్న ఇసుకను అన్‌లోడ్‌ చేసి అనంతపురం వెళ్లిపోయారు. హిటాచీని, దానిని తీసుకువచ్చిన లారీని గ్రామస్తులు అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుపడ్డారు.

వీఈర్వోపై దాడి
పుల్లలరేవు శ్మశాన వాటికలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్‌ వరప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు వీఆర్వో నాగేంద్రబాబు తలారికి సమాచారం ఇచ్చి ద్విచక్రవాహనంలో ఉదయం పదకొండు గంటలకు పుల్లలరేవుకు చేరుకున్నారు. అప్పటికే తలారి నాగన్న శ్మశానంలోని హిటాచి వద్ద కాపలాగా కూర్చున్నాడు. ఇసుకను ఎవరు తెమ్మన్నారని వీఆర్వో అడిగితే డ్రైవర్లు హిందీలో మాట్లాడారు. వారు చెప్పేది అర్థం కాకపోవడంతో డ్రైవర్లిద్దిరినీ వీఆర్వో, తలారి చెరొక బైక్‌లో ఎక్కించుకుని రాప్తాడుకు బయల్దేరారు. లింగనపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా మంత్రి పరిటాల సునీత సొదరుడు ధర్మవరపు మురళి అనుచరులు కారులో వచ్చి అడ్డం పెట్టారు. ‘మా మనుషులను ఎందుకు పిలుచుకుని వస్తున్నావ్‌. మేమెవరో నీకు తెలియదా?’ అంటూ దాడి చేశారు. ఒకేసారి నలుగురు వ్యక్తులు దాడి చేయడంతో వీఆర్వో ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకుని, అనంతపురం చేరుకున్నాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top